చెలరేగిన దూబే, రచిన్ రవీంద్ర
పడగొట్టిన దీపక్, తుషార్
63 పరుగులతో ఓడిన గుజరాత్
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది.
శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్‌లో గుజరాత్‌కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు.
ముందు రచిన్... తర్వాత దూబే...
చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్‌గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్‌వే కావడం విశేషం.
తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్‌కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్‌కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది.
మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్‌లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది.
టైటాన్స్ వల్ల కాలేదు!
కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్‌ప్లేలోనే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్‌కు వెళ్లిపోయారు.
వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు వికెట్లు అప్పగించేశారు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్‌పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X ముంబై
వేదిక: హైదరాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment