ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా..తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.
కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు.
"హార్దిక్ పాండ్యా నిజంగా సూపర్ కెప్టెన్. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్‌కు ఒక స్టైల్ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్ దిట్ట.
నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment