Photo: IPL Twitter
టెస్టులాడే ఆటగాడిని ఐపీఎల్‌కు తీసుకొచ్చారు.. 13.25 కోట్లు పెట్టి కొంటే దారుణంగా విఫలమవుతున్నాడు.. ఎస్‌ఆర్‌హెచ్ ఇలాంటి వారిని ఎందుకు కొనుగోలు చేస్తుందో అర్థం కాదు.. ఇవి తొలి మూడు మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ విఫలమైనప్పుడు వచ్చిన విమర్శలు. సోషల్ మీడియాలో అయితే బ్రూక్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా కెప్టెన్ మార్క్రమ్ సహా ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ అతనిపై నమ్మకముంచింది.
ఎట్టకేలకే శుక్రవారం(ఏప్రిల్ 14) కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రూక్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లతో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు.
హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
బ్రూక్ ఫామ్‌లోకి కాస్త అతన్ని ఆపడం ఎవరి తరం కాదు.. ఓపెనింగ్‌లో పంపింస్తే రాణించే అవకాశం ఉంటుంది అని ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. అందుకే ఓపిక ఉండడం చాలా అవసరం అని అంటారు. ఏమో బ్రూక్ ఇకపై తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందేమో.
ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ తొలుత విఫలమయ్యాడు. ఒకసారి కుదురుకున్నాకా అతనికి అడ్డు లేకుండా పోయింది. పీఎస్ఎల్‌లో 10 మ్యాచ్‌లాడిన బ్రూక్ ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 262 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం.
ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుస్తుందా ఓడుతుందా అన్నది పక్కనబెడితే.. బ్రూక్ లాంటి ఆటగాడు ఫామ్‌లోకి రావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు కొండంత బలం. రానున్న మ్యాచ్‌ల్లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment