‘నేను డకౌట్‌ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’ | Abhishek Sharma Video Calls Yuvraj Singh After Maiden T20I Hundred, He Was Very Happy When I Got Out For 0 | Sakshi
Sakshi News home page

‘నేను డకౌట్‌ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’

Published Mon, Jul 8 2024 5:11 PM | Last Updated on Mon, Jul 8 2024 5:35 PM

He Was Very Happy When I Got Out For 0: Abhishek Sharma About Yuvraj Singh

‘‘మొదటి మ్యాచ్‌ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్‌ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.

నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.

నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్‌ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్‌ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.

డకౌట్‌.. వెను వెంటనే సెంచరీ
భారత దిగ్గజ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్‌ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్‌ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రంలోనే అతడు డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.

కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.

తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. డకౌట్‌ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.

గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు
ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ తన మెంటార్‌ యువరాజ్‌ సింగ్‌కు కాల్‌ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం అతడు వరల్డ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్‌ ఫోన్‌కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. 

ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్‌లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

చదవండి: బాబర్‌ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement