టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘చురకలు’ అంటించాడు. బ్యాటింగ్ చేసేటపుడు మెదడును కాస్త అదుపులో పెట్టుకుంటేనే రాణించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయమేమిటంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అభిషేక్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.
మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు
ఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. అయితే, మరుసటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత అభిషేక్ శర్మ మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.
రనౌట్‌గా వెనుదిరిగి
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న క్రమంలో అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.
టీమిండియా ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేసిన టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సంజూ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్‌కు ఆస్కారం ఉందని భావించిన సంజూ, అభిషేక్ పరుగుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రమాదాన్ని గ్రహించిన సంజూ.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
బంతిని అందుకున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ తౌహీద్ హృదోయ్..నేరుగా స్టంప్స్ వైపునకు విసిరాడు. దీంతో.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు వెళ్లిపోయిన అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16 పరుగులు) పెవిలియన్‌కు చేరకతప్పలేదు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడలేదు. సంజూ శాంసన్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే!
ఈ నేపథ్యంలో విజయానంతరం అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో టీమిండియా ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! సిరీస్‌లో మాకు శుభారంభం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, ఆ కామెంట్‌కు యువీ.. ‘‘కేవలం మెదడు ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యం’’ అన్న అర్థంలో జవాబు ఇచ్చాడు.
కాగా అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఎదుగుదలలో యువీది కీలక పాత్ర. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు. అయితే, బాగా ఆడినపుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే విమర్శించడం యువీకి అలవాటు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున అభి వీరబాదుడు బాది.. నిర్లక్ష్యపు షాట్‌కు అవుటైనపుడు.. ‘నీ కోసం స్లిప్పర్ ఎదురు చూస్తోంది’ అంటూ యువీ చొరవగా ట్వీట్ చేశాడు.
చదవండి: Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’
Comments
Please login to add a commentAdd a comment