Indian Super League 2021: పరాజయంతో మొదలు | Hyderabad FC defeat Indian Super League football | Sakshi
Sakshi News home page

Indian Super League 2021: పరాజయంతో మొదలు

Published Wed, Nov 24 2021 5:11 AM | Last Updated on Wed, Nov 24 2021 10:27 AM

Hyderabad FC defeat Indian Super League football - Sakshi

హైదరాబాద్‌ చెన్నైయిన్‌ మధ్య మ్యాచ్‌లో ఓ దృశ్యం

బంబోలిమ్‌ (గోవా): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ తాజా సీజన్‌ను హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) ఓటమితో ఆరంభించింది. ఇక్కడి జీఎంసీ అథ్లెటిక్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 0–1 గోల్‌ తేడాతో చెన్నైయిన్‌ ఎఫ్‌సీ చేతిలో పరాజయంపాలైంది. చెన్నైయిన్‌ తరఫున వ్లాగిమిర్‌ కొమన్‌ (66వ నిమిషంలో) పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ను హైదరాబాద్‌ జట్టు దూకుడుగా ఆరంభించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదిస్తూ చెన్నైయిన్‌ ‘డి’ బాక్స్‌లోకి పదే పదే చొచ్చుకొచ్చింది. అయితే గోల్‌ చేయడంలో మాత్రం సఫలం కాలేదు.

చెన్నైయిన్‌ గోల్‌ కీపర్‌ విశాల్‌ కెయిత్‌ హైదరాబాద్‌ దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. అదే క్రమంలో గోల్‌ చేసే అవకాశాలను హైదరాబాద్‌ ఆటగాడు ఒగ్బెచె జారవిడిచాడు. అదే సమయంలో చెన్నైయిన్‌ పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో తొలి అర్ధ భాగం గోల్‌ లేకుండానే ముగిసింది. రెండో అర్ధ భాగంలో చెన్నైయిన్‌ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది.

హైదరాబాద్‌ ‘డి’ బాక్స్‌లో ఆ జట్టు ఆటగాడు హితేశ్‌ శర్మ ప్రత్యర్థి ప్లేయర్‌ అనిరుధ్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంతో రిఫరీ చెన్నైయిన్‌ జట్టుకు పెనాల్టీని కేటాయించాడు. ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని కొమన్‌ పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అనంతరం గోల్‌ కోసం హైదరాబాద్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement