
లాహోర్: గుండెపోటుకు గురయ్యాడంటూ నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలను పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఖండించాడు. తనకెటువంటి గుండెపోటు రాలేదని, కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య విషయం బయటపడిందని తెలిపాడు. చికిత్సలో భాగంగా స్టంట్ వేసి సమస్యను పరిష్కరించారని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
కాగా, కడుపులో కాస్త అసౌకర్యంగా ఉండడంతో ఇంజమామ్ సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా యాంజియోగ్రఫీ నిర్వహించగా.. రక్త నాళం ఒకటి కాస్త మూసుకుపోయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో స్టంట్ అమర్చి సమస్యను పరిష్కరించారు. 12 గంటల వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఇంజీ ఇంటికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పాక్ తరఫున 120 టెస్ట్‌లు, 378 వన్డేలు ఆడిన ఇంజీ.. ఇరవై వేలకు పైగా పరుగులు సాధించాడు. 2001-2007 మధ్యలో అతను పాక్ సారథిగా వ్యవహరించాడు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో ఇంజమామ్ సభ్యుడిగా ఉన్నాడు.
చదవండి: కేకేఆర్ బౌలర్‌కు గాయం.. సర్జరీ సక్సెస్