
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. లీగ్ ప్రారంభమై 15 ఏళ్లు గడుస్తున్నా ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. ఎందరో కెప్టెన్లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుత సీజన్ (2022)లో కూడా ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప మయాంక్ సేన ప్లే ఆఫ్స్ అర్హత సాధించలేని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. జట్టు నిండా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నా.. పంజాబ్ కింగ్స్ స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతుంది. పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తదుపరి ఆడే మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్న వేళ పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఓ ఫన్నీ కార్యక్రమాన్ని నిర్వహించింది. డు ఇట్ లైక్ శశి పేరుతో సాగిన ఈ ప్రోగ్రాంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో యాంకర్ శశి చెప్పే పాపులర్ హిందీ డైలాగ్‌లను పంజాబ్ కింగ్స్ విదేశీ ఆటగాళ్లు కెమెరా ముందు రిపీట్ చేశారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్నీ హోవెల్, ఆసీస్ పేసర్ నాథన్ ఇల్లీస్, విండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌లు శశి చెప్పిన డైలాగ్‌లను బాగానే అప్పజెప్పగా, సఫారీ పేసర్ కగిసో రబాడ మాత్రం డైలాగ్ చెప్పేముందు నవ్వులు పూయించాడు.
యాంకర్ శశి రబాడని 'మీకు సల్మాన్ ఖాన్ తెలుసా..?’ అని ప్రశ్నించగా అందుకు రబాడ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఆ సల్మాన్ ఖాన్ ఎవరో నాకు తెలీదు కానీ.. రషీద్ ఖాన్ అయితే తెలుసంటూ చమత్కరించాడు. అయితే ఆతర్వాత రబాడ చాలా కష్టం మీద సల్లు భాయ్ పాపులర్ డైలాగ్‌ను 'ఏక్ బార్ మైనే జో కమిట్‌మెంట్ కర్‌దీ’ (తెలుగులో మహేశ్ బాబు పోకిరి డైలాగ్.. ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను) ప్రేక్షకులకు వినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, 2020 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ అయిన రబాడాను ఈ సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.9.25 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుత సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన రబాడ 18 వికెట్లు తీసి మరోసారి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు.
చదవండి: 'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం'
Comments
Please login to add a commentAdd a comment