లండన్: ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. తాను దేన్నీ అంత తేలిగ్గా తీసుకోనని, తనది నిరంతర ప్రయాణమని, ప్రస్తుతం ఆట, ఫిట్‌నెస్‌లపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజమే.. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. ఇందుకోసం నేను విపరీతంగా కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే నా ఫీల్డింగ్ బాగుంటుంది. క్రెడిట్ గోస్ టూ విరాట్ కోహ్లీ.
అతను ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అతడిని చూసే జట్టు సభ్యుందరూ తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచుకున్నారు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పాడు. త్వరలో యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ 2021 ఆడటం ఉపయోగకరమని అభిప్రాయపడ్డాడు.
కాగా, ప్రస్తుతం జడ్డూ మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేస్తున్నాడు. సరైన సమయంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును ఆదుకుంటూ 3డీ ఆటగాడిగా సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(127), రహానే(1) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ(83), కోహ్లీ(42) రాణించగా.. పుజారా(9) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు.
Comments
Please login to add a commentAdd a comment