భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయాలనైనా కనీసం గౌరవించాలని హితవు పలికాడు.
తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి!
వన్డే ఫార్మాట్ మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టీమిండియాను అక్కడకు పంపించే పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
లాహోర్‌లోనే రోహిత్ సేన మ్యాచ్‌లన్నీ!
అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం టీమిండియాకు సైతం తమ దేశంలోనే ఆతిథ్యం ఇస్తామని.. టోర్నీ నిర్వహణలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఐసీసీకి చెప్పినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అంతేకాదు.. లాహోర్‌లోనే రోహిత్ సేన మ్యాచ్‌లన్నీ నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం టోర్నీ వేదికను మార్చే ఉద్దేశం లేదని చెప్పడం గమనార్హం.
ఇకపై పాకిస్తాన్ కూడా అదే పద్ధతిలో
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ ఐసీసీ ఆదేశాలను తప్పక గౌరవించాలి. ఒకవేళ వాళ్లు అలా చేయనట్లయితే.. ఇకపై పాకిస్తాన్ కూడా అదే పద్ధతి అనుసరిస్తుంది.
భవిష్యత్తులో ఇండియాలో జరుగబోయే ఈవెంట్లలో పాల్గొనదు. నిజానికి టీమిండియా క్రికెట్ దిగ్గజాలు బీసీసీఐకి సలహాలు ఇవ్వాలి. ఆటను, రాజకీయాలను వేరుగా చూడమని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఆశపడుతున్నారు.
అది కేవలం పాకిస్తాన్‌కు మాత్రమే కాదు.. ఆటకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి టీమిండియా ఇక్కడికి వస్తేనే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీని నిర్వహించేందుకు వివిధ స్టేడియాల్లో పీసీబీ చేపట్టిన మరమ్మత్తు పనులు ఇంకా పూర్తికానేలేదు.
చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment