టీ20 వరల్డ్‌కప్-2024లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. న్యూయర్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రోటీస్ తీవ్రంగా శ్రమించింది.
బౌన్స్‌కు సహకరిస్తున్న డ్రాప్ ఇన్ పిచ్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చుతూ 78 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్), డికాక్(20) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో కెప్టెన్ హసరంగా రెండు, తుషారా, షనక తలా వికెట్ సాధించారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన లంక.. ప్రోటీస్ బౌలర్ల దాటికి విలవిల్లాడింది. 19.1 ఓవర్లలో శ్రీలంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. దక్షిఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహారాజ్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ స్పందించాడు. న్యూయర్క్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉందని మార్‌క్రమ్ తెలిపాడు.
"టోర్నమెంట్‌ను విజయంతో ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా కాస్త ఇబ్బంది పడ్డాం. న్యూయర్క్ వికెట్ బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంది. అదృష్టవశాత్తూ మా బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
గతంలో కూడా మాకు ఇటువంటి పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్ధితుల్లో ఆడుతూ వస్తున్నాం. అయితే న్యూయర్క్ వికెట్ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మా తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా ఇక్కడే ఆడనున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వికెట్‌కు అలవాటు పడాలి.
ఇక నోర్జే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఫామ్ గురించి ఏ రోజు మేము ఆందోళన చెందలేదు. అతడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడని నేను అశిస్తున్నాను. నోర్జే ప్రదర్శన పట్ల మా డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్‌క్రమ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment