టీ20 ప్రపంచకప్-2024లో సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు అద్భుతంగా ఆడిందని.. ఈ గెలుపు తమకు ఊరటనందించిందని పేర్కొన్నాడు.
వర్షం పడి వెలిసిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారిందన్న మార్క్రమ్.. వీలైనంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయాలని భావించినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. అంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు విండీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
వర్షం వల్ల అంతరాయం
సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్ కైలీ మేయర్స్ 35 పరుగులతో రాణించాడు.
ప్రొటిస్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ మూడు కీలక వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. రెండో ఇన్నింగ్స్‌ను 17 ఓవర్లకు కుదించారు.
డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 123 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఆరంభంలో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయినా.. ట్రిస్టన్ స్టబ్స్(29), హెన్రిచ్ క్లాసెన్(22), మార్కో జాన్సన్(14 బంతుల్లో 21) మెరుగ్గా రాణించి జట్టుకు విజయం అందించారు.
మాకిది ఒక గుణపాఠం లాంటిదే
మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించిన సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. ఆతిథ్య వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
వికెట్‌ను సరిగ్గా అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఆడారు. షంసీ రూపంలో మిస్టరీ స్పిన్నర్‌ను వెస్టిండీస్‌పై అస్త్రంలా ప్రయోగించి విజయవంతమయ్యాం.
అయితే, లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. మాకిది ఒక గుణపాఠం లాంటిదే. పరిస్థితులకు అనుగుణంగా ఇంకాస్త తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ 18 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు.
చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్!
Comments
Please login to add a commentAdd a comment