IND VS AUS 1st Test: Ravindra Jadeja Slams Fifty Along With Fifer - Sakshi
Sakshi News home page

BGT 2023: రీ ఎంట్రీలో ఇరగదీస్తున్న జడేజా.. ఐదేయడంతో పాటు..!

Published Fri, Feb 10 2023 4:10 PM | Last Updated on Fri, Feb 10 2023 4:59 PM

 IND VS AUS 1st Test: Ravindra Jadeja Slams Fifty Along With Fifer - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. గాయం కారణంగా గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్‌.. వచ్చీ రాగానే టెస్ట్‌ల్లో తన ప్రతాపం చూపించాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో నిన్న బంతి​తో (5/68) మ్యాజిక్‌ చేసిన జడేజా.. ఇవాళ (ఫిబ్రవరి 10) బ్యాట్‌తో (53 నాటౌట్‌) రెచ్చిపోయాడు.

ఈ సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో చెలరేగిన జడేజా.. తమిళనాడుపై ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్‌.. పర్ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నాడు. టెస్ట్‌ల్లో జడేజా గత 10 ఇన్నింగ్స్‌లను ఓ సారి పరిశీలిస్తే.. గతేడాది జడ్డూ చివరిగా ఆడిన టెస్ట్‌ మ్యాచ్‌లోనూ శతకంతో మెరిశాడు.

జూన్‌ 1 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. దానికి ముందు మార్చి 4న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన జడేజా.. ఏకంగా 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బంతితోనూ మ్యాజిక్‌ చేసిన జడ్డూ భాయ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. దీనికి ముందు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హాఫ్‌ సెంచరీ చేసి 5 వికెట్లు పడగొట్టిన జడేజా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

ఇటీవలికాలంలో ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా రాటుదేలిన జడేజా.. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన మార్కు ప్రభావం చూపుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత రోహిత్‌ సహకారంతో చెలరేగిన (బ్యాటింగ్‌) జడేజా.. ఆతర్వాత సహచరులు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుతున్నా తాను మాత్రం ఏకాగ్రతతో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. 99 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 281/7గా ఉంది. జడేజాకు తోడుగా మరో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (22) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి భారత్‌ 105 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement