గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఆస్ట్రేలియా పేసు గుర్రం మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023 జరుగనున్న భారత గడ్డపై స్టార్క్ మునుపటి తరహాలో రెచ్చిపోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఏమంత ప్రభావం చూపించని స్టార్క్.. టీమిండియాతో వన్డే సిరీస్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.
ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులిచ్చి ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లను ఔట్ చేసిన స్టార్క్.. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చిన స్టార్క్.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. స్టార్క్ స్పెల్‌లో ఓ మొయిడిన్ కూడా ఉంది.
ఈ మ్యాచ్‌లో ఫైఫర్ సాధించడంతో స్టార్క్ ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లసిత్ మలింగ (8)ను వెనక్కునెట్టి, బ్రెట్ లీ (9), షాహిద్ అఫ్రిది (9) సరసన చేరాడు. కెరీర్‌లో 109 వన్డేలు ఆడిన స్టార్క్ 9 ఫైఫర్‌ల సాయంతో 219 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌ల రికార్డు వకార్ యూనిస్ (13) పేరిట ఉంది. వకార్ తర్వాతి స్థానాల్లో ముత్తయ్య మురళీథరన్ (10), స్టార్క్ (9) ఉన్నారు.
ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment