
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో 132 పరుగులు చేస్తే.. ఇంత వరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధిస్తాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఐసీసీ రెండేళ్లకొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అజింక్య రహానే పేరిట ఆ రికార్డు
ఇక 2019-21 నుంచి డబ్ల్యూటీసీ మొదలు కాగా.. ఆ సీజన్‌లో భారత్ తరఫున టెస్టు స్పెషలిస్టు అజింక్య రహానే 1159 పరుగులు సాధించాడు. తద్వారా ఒక డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరిట రికార్డును పదిలం చేసుకున్నాడు. అయితే, ఆ ఘనతను అధిగమించేందుకు జైస్వాల్‌కు ఇప్పుడు అవకాశం వచ్చింది.
జైస్వాల్ 132 రన్స్ చేస్తే..
ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్(2023-25)లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు 1028 పరుగులు సాధించాడు. ఈ 22 ఏళ్ల లెఫ్టాండర్ గనుక మరో 132 రన్స్ చేస్తే.. రహానేను వెనక్కినెట్టి డబ్ల్యూటీసీ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా తన పేరును లిఖించుకోగలుగుతాడు.
రూట్ రికార్డుకు ఎసరు పెట్టాడు
అంతేకాదు.. మరో 371 పరుగులు చేస్తే ఓవరాల్‌గా ఈ సైకిల్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(1398 రన్స్)ను కూడా జైస్వాల్ అధిగమించగలడు. ప్రస్తుతం జైస్వాల్.. మరో ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్(1028 రన్స్)తో కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా జట్ల విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో ఉంది.
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు జరుగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచి.. అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బంగ్లాదేశ్ తర్వాత రోహిత్ సేన సొంతగడ్డపై న్యూజిలాండ్(మూడు టెస్టులు)తో తలపడనుంది.
డబ్ల్యూటీసీ వీరుడిగా
అనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇందులో భాగంగా కంగారూ జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగానే డబ్ల్యూటీసీ ఇండియా వీరుడిగా నిలిచే అవకాశం ఉంది.
లేదంటే.. మరికొన్నాళ్లు అతడు వేచిచూడకతప్పదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే యశస్వి జైస్వాల్ ఖాతాలో ఇప్పటికే టెస్టుల్లో మూడు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం అతడి సత్తాకు నిదర్శనం.
చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment