టీమిండియాపై తొలి టెస్టులో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోకాలి కారణంగా అతడు విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
ఈ నేపథ్యంలో జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉపఖండ పిచ్‌లపై బంతి బాగా టర్న్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.
అనుభవజ్ఞుడైన జాక్ లీచ్‌తో పాటు యువ బౌలర్లు రెహాన్ అహ్మద్, టామ్ హార్లీలను తుదిజట్టులో ఆడించింది. వీరంతా మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలుపంచుకోగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా అద్భుతంగా రాణించాడు.
అరంగేట్ర బౌలర్ హార్లీ అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీస్తే.. రూట్ ఐదు, రెహాన్ మూడు, జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జాక్ లీచ్ ఎడమ మోకాలికి గాయమైంది.
ఇదిలా ఉంటే... బ్యాటర్ ఒలి పోప్ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 రన్స్ తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో రెండో మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా- ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సిద్ధం కాగా.. జాక్ లీచ్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది: ఇంగ్లండ్ మాజీ సారథి
Comments
Please login to add a commentAdd a comment