ఓవల్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధిస్తున్న తరుణంలో ఈ వార్త టీమిండియాపై ఏమేరకు ప్రభావం చూపుతోందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, ఈ టెస్ట్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’
Comments
Please login to add a commentAdd a comment