ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్‌మ్యాన్.. తాజాగా బ్యాటింగ్‌లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్‌మ్యాన్ 32 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్‌స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు.
కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment