Ind Vs Eng: Bumrah Says Captaincy Future Is Not What I Decide Like Responsibility - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: అందుకే ఓడిపోయాం.. అయితే, కెప్టెన్సీ చేయడం నచ్చింది! భవిష్యత్తులో..

Published Wed, Jul 6 2022 3:30 PM | Last Updated on Wed, Jul 6 2022 4:50 PM

Ind Vs Eng: Bumrah Says Captaincy Future Is Not What I Decide Like Responsibility - Sakshi

వికెట్‌ తీసిన ఆనందంలో బుమ్రా(PC: BCCI)

India Vs England 5th Test- Jasprit Bumrah Comments: ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్‌ టెస్టుతో తొలిసారిగా టీమిండియాకు సారథ్యం వహించాడు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. ఇప్పటి వరకు ఏ జట్టుకూ.. ఏ ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీ చేయని బుమ్రా ఏకంగా ఇంగ్లండ్‌తో పోరుతో కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. టీమిండియా దిగ్గజం కపిల్‌దేవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేసర్‌గా నిలిచాడు.

ఈ క్రమంలో మొదటి మూడు రోజుల వరకు టీమిండియా చేతిలో ఉన్న మ్యాచ్‌ నాలుగో రోజు ఒక్కసారిగా చేజారింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లు జో రూట్‌, జానీ బెయిర్‌ స్టో విజృంభించడంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. దీంతో ఐదో టెస్టులో ఓటమిపాలైన భారత్‌ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది.

అయితే, కెప్టెన్‌గా బుమ్రాను కొంతమంది వ్యతిరేకించినా.. ఈ మ్యాచ్‌లో అతడు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచి అభిమానుల హృదయాలు గెలుచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 16 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు బుమ్రా. రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులే చేసినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. ఈ ఒక్క మ్యాచ్‌తోనే తనను ఆల్‌రౌండర్‌ అనలేమని వ్యాఖ్యానించాడు. అదే విధంగా భవిష్యత్తులో కెప్టెన్సీ చేస్తానా లేదా అన్న అంశం తన పరిధిలోనిది కాదన్నాడు. 

మ్యాచ్‌ గురించి చెబుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌లో ఉన్న మజానే ఇది. మూడు రోజులు మ్యాచ్‌ మన చేతిలో ఉన్నట్లు అనిపించినా.. ఒక్కరోజు బ్యాటింగ్‌ సరిగా చేయకపోతే.. ప్రత్యర్థి జట్టు చేతుల్లోకి వెళ్తుంది. అయితే, ఇందుకు సాకులు వెతకాల్సిన అవసరం లేదు.

ఒకవేళ మొదటి మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించి ఉండకపోతే మేమే సిరీస్‌ గెలిచేవాళ్లం. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా ఐదో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. సిరీస్‌ డ్రా అయింది. పంత్‌ రాణించాడు. జడ్డూ ఫామ్‌లోకి వచ్చాడు.

చాలా సంతోషంగా ఉంది. ద్రవిడ్‌ ఎల్లప్పుడూ మాకు అండగా నిలబడతారు. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. భవిష్యత్తులో నేను కెప్టెన్‌ అవుతానా లేదా అన్నది నేను నిర్ణయించే అంశం కాదు. నా చేతుల్లో ఏమీ లేదు. అయితే, ఈ బాధ్యత చేపట్టడం నాకెంతగానో నచ్చింది. నిజంగా ఇదొక గొప్ప సవాలు. కొత్తది కూడా! నాకు దక్కిన గొప్ప గౌరవం.. అలాగే ఇదొక గొప్ప అనుభవం కూడా!’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

చదవండి: ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్‌.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్‌స్టో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement