IND Vs ENG: India Beat England 49 Runs 2nd T20I Clinch Series With 2-0 - Sakshi
Sakshi News home page

IND Vs ENG 2nd T20: అదరగొట్టారు.. టీమిండియాదే సిరీస్‌

Published Sun, Jul 10 2022 1:45 AM | Last Updated on Sun, Jul 10 2022 12:59 PM

India Beat England 49 Runs 2nd T20I Clinch Series With 2-0 - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఈసారి బౌలింగ్‌ దెబ్బతో ఏకంగా టి20 సిరీస్‌ను ఇంకో మ్యాచ్‌ ఉండగానే టీమిండియా పట్టేసింది. భువనేశ్వర్‌ (3/15), బుమ్రా (2/10), యజువేంద్ర చహల్‌ (2/10)ల నమ్మశక్యంకాని బౌలింగ్‌తో భారత్‌ 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. మూడు టి20ల సిరీస్‌ను 2–0తో వశం చేసుకున్న భారత్‌ నేడు ఆఖరి మ్యాచ్‌ ఇదే వేదికపై ఆడుతుంది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు), రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లు జోర్డాన్‌ (4/27), గ్లీసన్‌ (3/15) అదరగొట్టారు. తర్వాత ఇంగ్లండ్‌ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్‌ అలీ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ విల్లే (22 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరువు నిలిపే పరుగులు చేశారు. రెగ్యులర్‌ ప్లేయర్స్‌ కోహ్లి, పంత్, జడేజా, బుమ్రా అందుబాటులోకి రావడంతో ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్, అర్‌‡్షదీప్‌లను పక్కన బెట్టారు.  

ఆదుకున్న జడేజా 
తొలి ఓవర్లోనే రోహిత్‌ (1 వద్ద)  ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను జేసన్‌ రాయ్‌ నేలపాలు చేశాడు. తర్వాత భారత కెప్టెన్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు. సిక్సర్లు, బౌండరీలతో వేగం పెంచిన ‘హిట్‌మ్యాన్‌’ను గ్లీసన్‌ బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. ఇదే జోరుతో గ్లీసన్‌...  కోహ్లి (1), రిషభ్‌ పంత్‌ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌)లను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. సూర్యకుమార్‌ (15), హార్దిక్‌ పాండ్యా (12) జోర్డాన్‌ పేస్‌కు తలవంచారు. 89 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన భారత ఆశలన్నీ జడేజా, దినేశ్‌ కార్తీక్‌ (17 బంతుల్లో 12; 1 ఫోర్‌)లపైనే పెట్టుకుంది. కానీ కార్తీక్‌ రనౌటయ్యాడు. ఈ దశలో రవీంద్ర జడేజా ఆపద్భాంధవుడిగా మారాడు. గ్లీసన్, జోర్డాన్‌లు నిప్పులు చెరుగుతున్నా తన వికెట్‌ విలువను గుర్తుంచుకొని టెయిలెండర్‌ హర్షల్‌ పటేల్‌ (13)తో కలిసి జట్టు స్కోరును పెంచాడు.  

బెంబేలెత్తించిన భువనేశ్వర్‌ 
లక్ష్యఛేదనకు దిగగానే ఇంగ్లండ్‌ కష్టాలపాలైంది. చాన్నాళ్ల తర్వాత భువనేశ్వర్‌ వైవిధ్యమైన బౌలింగ్‌ తో అంతర్జాతీయ టి20లోనే ప్రమాదకర ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (0), బట్లర్‌ (4) పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత గాడినపడకుండా బుమ్రా, చహల్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. లివింగ్‌ స్టోన్‌ (15), హ్యారీ బ్రూక్‌ (8), మలాన్‌ (19), సామ్‌ కరన్‌ (2) ఎవర్నీ ఎక్కువసేపు ఆడనివ్వలేదు. 60 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ లక్ష్యానికి దూరమై... ఓటమికి చేరుకైంది. కాసేపు మొయిన్‌ అలీ ఎదురుదాడికి దిగినా... ఆఖరి దాకా విల్లే నిలిచినా ఇంగ్లండ్‌కు పరాభవం తప్పలేదు. మూడు వికెట్లు తీసిన భారత బౌలర్‌ భువనేశ్వర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

►ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను గెలవడం ఇది రెండోసారి. 2018లో భారత్‌ 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2018లో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా నెగ్గగా... ఈసారి రోహిత్‌ సారథ్యంలో సిరీస్‌ దక్కింది.

►మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి భారత కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకిది వరుసగా 19వ విజయం.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బట్లర్‌ (బి) గ్లీసన్‌ 31; పంత్‌ (సి) బట్లర్‌ (బి) గ్లీసన్‌ 26; కోహ్లి (సి) మలాన్‌ (బి) గ్లీసన్‌ 1; సూర్యకుమార్‌ (సి) కరన్‌ (బి) జోర్డాన్‌ 15; హార్దిక్‌ (సి) మలాన్‌ (బి) జోర్డాన్‌ 12; జడేజా (నాటౌట్‌) 46; కార్తీక్‌ (రనౌట్‌) 12; హర్షల్‌ (సి) గ్లీసన్‌ (బి) జోర్డాన్‌ 13; భువనేశ్వర్‌ (సి) విల్లే (బి) జోర్డాన్‌ 2; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–49, 2–61, 3–61, 4–89, 5–89, 6–122, 7–145, 8–159. బౌలింగ్‌: డేవిడ్‌ విల్లే 3–0–35–0, సామ్‌ కరన్‌ 3–0–26–0, మొయిన్‌ అలీ 2–0–23–0, రిచర్డ్‌ గ్లీసన్‌ 4–1–15–3, పార్కిన్సన్‌ 2–0–21–0, క్రిస్‌ జోర్డాన్‌ 4–0–27–4, లివింగ్‌స్టోన్‌ 2–0–23–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) రోహిత్‌ (బి) భువనేశ్వర్‌ 0; బట్లర్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 4; మలాన్‌ (సి) హర్షల్‌ (బి) చహల్‌ 19; లివింగ్‌స్టోన్‌ (బి) బుమ్రా 15; బ్రూక్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చహల్‌ 8; అలీ (సి) రోహిత్‌ (బి) పాండ్యా 35; సామ్‌ కరన్‌ (సి) పాండ్యా (బి) బుమ్రా 2; విల్లే (నాటౌట్‌) 33; జోర్డాన్‌ (రనౌట్‌) 1; గ్లీసన్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 2; పార్కిన్సన్‌ (బి) హర్షల్‌ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్‌) 121. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–27, 4–41, 5–55, 6–60, 7–94, 8–95, 9–109, 10–121. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–1–15–3, బుమ్రా 3–1–10–2, హార్దిక్‌ పాండ్యా 3–0–29–1, హర్షల్‌ పటేల్‌ 4–0–34–1, చహల్‌ 2–0–10–2, రవీంద్ర జడేజా 2–0–22–0.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement