అందుకే ఇషాన్‌పై వేటు?.. వస్తే నేరుగా తుదిజట్టులోకే! | Ind vs Eng: Ishan Kishan Dropped Despite Dravid Clarification Shami Misses Out | Sakshi
Sakshi News home page

అందుకే ఇషాన్‌పై వేటు?.. వస్తే నేరుగా తుదిజట్టులోకే!

Published Sat, Jan 13 2024 1:10 PM | Last Updated on Sat, Jan 13 2024 2:30 PM

Ind vs Eng: Ishan Kishan Dropped Despite Dravid Clarification Shami Misses Out - Sakshi

Ind vs Eng 5 Match Test Series 2024: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌లలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. సొంతగడ్డపై దాదాపు నెలన్నర పాటు జరుగనున్న ఈ సిరీస్‌ సందర్భంగా ఓ కొత్త ఆటగాడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. కేఎల్‌ రాహుల్‌, కోన శ్రీకర్‌ భరత్‌లతో పాటు మూడో వికెట్‌ కీపర్‌ ఆప్షన్‌గా అతడికి అవకాశం ఇచ్చారు. నిజానికి స్టార్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

మధ్యలోనే తిరిగి వచ్చాడు
గత కొన్నాళ్లుగా ఈ జార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జట్టుతో ప్రయాణిస్తున్నా తుదిజట్టులో ఆడే అవకాశం రావడం లేదు. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసికంగా అలసిపోయానంటూ బీసీసీఐ దగ్గర సెలవు తీసుకుని ఆటకు విరామం ప్రకటించాడు.

అయితే, ఇషాన్‌ కిషన్‌ వ్యవహారశైలి నచ్చని బీసీసీఐ పెద్దలు క్రమశిక్షణ చర్యల కింద అతడిని కొన్నాళ్లపాటు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ను అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదనే విమర్శలు వచ్చాయి.

అలాంటిదేమీ లేదన్న ద్రవిడ్‌
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా స్పందించాడు.  ఇషాన్‌పై అలాంటి చర్యలేమీ తీసుకోలేదని.. అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేడు కాబట్టే ఎంపిక చేయలేదని తెలిపాడు. అయితే, మళ్లీ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.

రంజీలో నేరుగా తుదిజట్టులో ఆడిస్తామన్న జార్ఖండ్‌ మేనేజ్‌మెంట్‌
ఈ క్రమంలో జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేబాశిష్‌ చక్రవర్తి ఇషాన్‌ కిషన్‌కు తాము స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇంత వరకు ఇషాన్‌ తమను సంప్రదించలేదని.. ఒకవేళ అతడు రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో జార్ఖండ్‌ జట్టుకు ఆడాలనుకుంటే.. నేరుగా తుదిజట్టులో ఆడిస్తామని స్పష్టం చేశాడు.  

అయినప్పటికీ ఇంత వరకు ఇషాన్‌ కిషన్‌ జార్ఖండ్‌ జట్టుతో చేరలేదని తెలుస్తోంది. ఒకవేళ రంజీలకు దూరంగా ఉండాలని ఇషాన్‌ నిర్ణయించుకుంటే ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అతడికి చోటు దక్కకపోవచ్చు.

తొలి టెస్టు హైదరాబాద్‌లో
ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన ఇషాన్‌.. మిగతా మూడు మ్యాచ్‌లు కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ చెప్పిన మాటలు పెడచెవిన పెడితే రీఎంట్రీ అసాధ్యమవుతుంది. చూడాలి మరి ఈ యంగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఏం చేస్తాడో!!  

ఇదిలా ఉంటే.. ఇషాన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ధ్రువ్‌ భారత అండర్‌–19 జట్టుకు ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  ఇక భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో... రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నంలో జరుగుతాయి.  

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, ముకేశ్‌ కుమార్, అవేశ్‌ ఖాన్‌. 

చదవండి: Ind vs Eng ఎవరీ ధ్రువ్‌ జురెల్‌? తండ్రి కార్గిల్‌ యుద్ధంలో.. తల్లి త్యాగం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement