
ఇషాన్ కిషన్- జై షా(PC: BCCI)
Jay Shah’s Stern Message to Central Contract Players: టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న క్రికెటర్లను ఉద్దేశించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
కాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్- బీసీసీఐకి మధ్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు విశ్రాంతి కావాలంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ జార్ఖండ్ బ్యాటర్‌ను దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందిగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు.
అయితే, మేనేజ్‌మెంట్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌తో బిజీ అయ్యాడు. ఫలితంగా బోర్డు పెద్దల ఆగ్రహానికి గురైన అతడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడనే ఊహాగానాలు వినిపించాయి.
అంతేగాకుండా.. ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడితేనే బీసీసీఐ.. ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ అంశాలపై స్పందించాడు.
‘‘తాము దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండటం లేదని కొంతమంది ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, అందుకు బదులుగా నేను వారికి లేఖ రూపంలో జవాబు ఇవ్వదలచుకున్నాను.
కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే
ఒకవేళ సెలక్షన్ కమిటీ చైర్మన్, కోచ్, కెప్టెన్ చెబితే మాత్రం కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే అని చెప్తాను. ఎవరైనా ఆటగాడు ఫిట్‌గా ఉన్నాడా లేదా? అతడు పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్ రెండూ ఆడగలడా లేదా అన్న విషయాల గురించి ఎన్‌సీఏ నుంచి సలహాలు తీసుకుంటాం.
అందరికీ వర్తిస్తుంది
అందుకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. అయితే, ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు.. ముఖ్యంగా యువ క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. కచ్చితంగా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న అందరు భారత క్రికెటర్లకూ ఇది వర్తిస్తుంది’’ అని జై షా కుండబద్దలు కొట్టాడు.
కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభానికి ముందు సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం పేరు మార్చారు. సౌరాష్ట్ర క్రికెట్ పాలనా విభాగంలో సేవలు అందించిన నిరంజన్ షా స్టేడియంగా నామకరణం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన జై షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం
Comments
Please login to add a commentAdd a comment