మీ నాన్న ఇక్కడ లేరు.. అయితేనేం!.. ద్రవిడ్‌ వ్యాఖ్యలు వైరల్‌ | Ind Vs Eng 4th Test: Rahul Dravid Goosebumps Speech On Akash Deep And He Touches His Mother Feet, Videos Goes Viral - Sakshi
Sakshi News home page

Rahul Dravid Speech On Akash Deep: నాన్న లేరు.. అయితేనేం! అమ్మ ఆశీర్వదించింది.. కొడుకు అదరగొట్టాడు!

Published Fri, Feb 23 2024 6:39 PM | Last Updated on Fri, Feb 23 2024 7:14 PM

Dravid Remembers Akash Deep Father Goosebump Speech Touches Mother Feet - Sakshi

అమ్మ ఆశీర్వదించింది.. కొడుకు అదరగొట్టాడు!(PC: BCCI/X)

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. రెండో టెస్టులో మధ్యప్రదేశ్‌ రజత్‌ పాటిదార్‌, మూడో టెస్టులో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడగుపెట్టారు.

తాజాగా శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేతుల మీదుగా  టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. 27 ఏళ్ల వయసులో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు.

నిజానికి ఆకాశ్‌ దీప్‌ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి, సోదరుడిని కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని.. ఆటపై దృష్టి సారించాడు. స్వస్థలమైన బిహార్‌లో అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ బెంగాల్‌కు మకాం మార్చి అక్కడే తన నైపుణ్యాలకు పదును పెట్టి దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఈ విషయం గురించి హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘‘రాంచికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాడి నుంచి నీ ప్రయాణం మొదలుపెట్టావు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని.. ఎత్తుపళ్లాలు చూసి ఇక్కడి దాకా వచ్చావు.

నీ కాళ్లపై నీవు నిలబడి.. బాడి నుంచి ఢిల్లీ దాకా చేరుకున్నావు. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయం చూసి ఆటపట్ల ఆకర్షితుడవై.. ఢిల్లీలోనే నీ ప్రయాణం మొదలుపెట్టాలని భావించావు.

ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లి.. అక్కడ డొమెస్టిక్‌ క్రికెట్‌లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నావు. ఆ జర్నీ నిన్ను ఇప్పుడు ఇక్కడ రాంచి దాకా తీసుకువచ్చింది. నీ గ్రామానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో నువ్వు ఇండియా  క్యాప్‌ అందుకున్నావు. అది కూడా నీ కుటుంబ సభ్యుల సమక్షంలో! 

ముఖ్యంగా మీ అమ్మగారి ముందు.. ఈ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో నేను ఊహించగలను. కానీ దురదృష్టవశాత్తూ మీ నాన్నగారు, మీ అన్నయ్య ఇక్కడ లేరు. అయితే, వాళ్ల ఆశీర్వాదాలు మాత్రం నీతోనే ఉంటాయి. జట్టు మొత్తం నీకు అండగా ఉంది. శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

ఈ క్షణాన్ని నువ్వు పూర్తిగా ఆస్వాదించు. నీ కల నిజమైంది. ఇదిగో అందుకో టీమిండియా టెస్టు క్యాప్‌ నంబర్‌ 313’’ అంటూ ఆకాశ్‌ దీప్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత, స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు. ఇక క్యాప్‌ అందుకున్న అనంతరం ఆకాశ్‌ దీప్‌ తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు.

ఇక టీమిండియా జెర్సీతో బరిలోకి దిగి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో.. బెన్‌ డకెట్‌, ఒలీ పోప్‌ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్‌ క్రాలేను కూడా పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చి తొలి రోజు మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఆకాశ్‌ దీప్‌ను ఉద్దేశించి ద్రవిడ్‌ ప్రసంగం, అతడు తన తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement