సర్ఫరాజ్‌కు షాకిచ్చిన బషీర్‌.. ఊహించలేదు కదా! | Ind Vs Eng 4th Test: Thodi Thodi Aati Hain..'Bashir Hilarious Reply To Sarfaraz Khans Banter Via Stump Mic, Video Goes Viral- Sakshi
Sakshi News home page

Ind Vs Eng 4th Test: బంతితో చెలరేగిన బషీర్‌.. అంతకంటే ముందు సర్ఫరాజ్‌కు షాకిచ్చాడిలా!

Published Sat, Feb 24 2024 4:17 PM | Last Updated on Sat, Feb 24 2024 5:59 PM

Ind vs Eng Thodi Thodi: Bashir Hilarious Reply To Sarfaraz Khan Goes Viral - Sakshi

సర్ఫరాజ్‌ ఖాన్‌- షోయబ్‌ బషీర్‌ (PC: BCCI/JIO Cinema)

టీమిండియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ఇంగ్లండ్‌ బౌలర్‌ షోయబ్‌ బషీర్‌. సర్రేలో జన్మించిన 20 ఏళ్ల ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌ మూలాలు మాత్రం పాకిస్తాన్‌లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భారత గడ్డపై సిరీస్‌ ఆడేందుకు వచ్చే క్రమంలో వీసా సమస్యలు ఎదుర్కొన్నా.. ఎట్టకేలకు ఇండియాలో అడుగుపెట్టాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అవుట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల ఖాతా తెరిచిన బషీర్‌.. తన తొలి మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, మూడో టెస్టులో మార్క్‌వుట్‌ ఎంట్రీ కారణంగా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. రాంచి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా శుబ్‌మన్‌ గిల్‌(38), రజత్‌ పాటిదార్‌(17)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బషీర్‌.. రవీంద్ర జడేజా(12) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బషీర్‌ బౌలింగ్‌ నైపుణ్యాలకు ఫిదా అయిన క్రికెట్‌ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బౌలింగ్‌ కంటే ముందు రెండో రోజు ఆటలో బ్యాట్‌తో బరిలోకి దిగాడు బషీర్‌. జడేజా బౌలింగ్‌లో ఒలీ రాబిన్సన్‌(58) అవుట్‌ కాగానే అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు. 

ఈ క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ బషీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. అతడు క్రీజులోకి వచ్చే సరికి సిల్లీ పాయింట్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సర్ఫరాజ్‌.. సహచర ఆటగాళ్లతో.. ‘‘అతడికి హిందీ రాదు కదా’’ అని వ్యాఖ్యానించాడు.

టీమిండియా ఫీల్డింగ్‌ సెట్‌ చేసుకుంటున్న సమయంలో సర్ఫరాజ్‌ అన్న ఈ మాటలకు బదులిస్తూ.. ‘‘నాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు’’ అని బషీర్‌ బదులిచ్చాడు. దీంతో అవాక్కవడం సర్ఫరాజ్‌ వంతైంది.

నెటిజన్లు ఈ సరదా సంభాషణ గురించి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక టీమిండియా.. రెండో రోజు ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement