
హైదరాబాద్ వేదకగా న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 18) జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తుది జట్టులో యువకులకు సముచిత స్థానం దక్కాలంటే, సీనియర్లు కొన్ని త్యాగాలు చేయక తప్పదని టీమిండియా మాజీ ప్లేయర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సైతం తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇదే విషయాన్ని పలు విశ్లేషకులు కూడా ప్రస్తావిస్తున్నారు.
త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో యువకులకు వీలైనన్ని అవకాశాలు కల్పించాలంటే సీనియర్లు తమ బ్యాటింగ్ స్థానాలను మార్చుకోక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలా లేక తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలా అని జట్టు మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతుంది.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్‌కు జతగా ఇషాన్ కిషన్‌ను బరిలోకి దించేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కావడంతో ఈ జోడీకే యాజమాన్యం ఓటు వేసినట్లు సమాచారం. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్‌కు కూడా అన్యాయం జరగకుండా, కోహ్లిని బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కు పంపి వన్ డౌన్‌లో గిల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే కోహ్లి నాలుగో స్థానంలో, సూర్యకుమార్ ఐదులో, హార్ధిక్ ఆరో స్థానంలో, ఏడో ప్లేస్‌లో సుందర్, ఆతర్వాత బౌలర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment