Ind Vs Sa 2nd Test: Pujara 3 Runs Rahane Golden Duck Trolls Thanks Purane: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో వైఫల్యాలు.. అయినా సరే విదేశీ గడ్డ మీద అనుభవం ఆధారంగా దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపిక... తొలి టెస్టులో తుది జట్టులో చోటు... కానీ అక్కడ కూడా అదే తీరు... టీమిండియా సీనియర్ టెస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే గురించే ఈ ప్రస్తావన. సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా గోల్డెన్ డక్... రహానే 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా వారి స్కోర్లు... 16,20. అయినా సరే యాజమాన్యం ఈ ఇద్దరు సీనియర్లపై నమ్మకం ఉంచి రెండో టెస్టులోనూ అవకాశమిచ్చింది. అయినా రాత మారలేదు. ఈసారి పుజారా 3 పరుగులు సాధిస్తే... రహానే గోల్డెన్ డక్. వదిలేస్తే పోయే బంతిని అనవసరంగా గెలికి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు ఇలా వచ్చి అలా వెళ్లడంతో 50 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. మయాంక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించినా వీళ్లిద్దరు మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. దీంతో టీమిండియా అభిమానుల సోషల్ మీడియా వేదికగా పుజారా, రహానే ఆట తీరును విమర్శిస్తున్నారు.
ఓవైపు వెన్ను నొప్పి కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టుకు దూరమైన తరుణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇలా చేయడం ఏమిటని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘పురానే’కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటికైనా పుజారా, రహానేను పక్కనపెట్టాల్సిందే. ఈ విషయాన్ని అంగీకరించకతప్పదు. ప్రతి ఒక్కరు ప్రతిసారీ బాగా ఆడతామని చెప్పలేము. కానీ వరుసగా వైఫల్యం చెందుతున్నా జట్టులో చోటివ్వడం అర్థం లేనిది.
వారి స్థానంలో ప్రతిభ గల యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొంత మంది.. ‘‘మీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్‌నకు విలువ ఇస్తారని మాకు తెలుసు. పుజారా అవుటయ్యాడో లేదో.. వెంటనే తాను కూడా పెవిలియన్ చేరి ఫ్రెండ్‌ను హగ్ చేసుకున్నాడు. ఇది కదా నిజమైన స్నేహం. ఎందుకురా సామీ ఇలా ఆడుతున్నారు. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఆడండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
చదవండి: Virat Kohli: అరెరె కోహ్లికి గాయమా? ముఖాలు మాడిపోయాయా.... గర్వం అణిగిందా...
Comments
Please login to add a commentAdd a comment