
PC: Disney+Hotstar(Twitter)
పుజారా వల్ల ఐదు పెనాల్టీ పరుగులు... మయాంక్ ఇలా..
Ind Vs Sa 3rd Test- Pujara- mayank- Virat Kohli: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో రాణించగా... మహ్మద్ షమీ, సిరాజ్‌స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బౌలర్ల ప్రదర్శన బాగానే ఉన్నా.. ఫీల్డర్లు మాత్రం కొన్ని తప్పిదాలు చేశారు. దీంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
పుజారా వల్ల ఐదు పెనాల్టీ పరుగులు...
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ పరుగుల శిక్ష పడింది. శార్దుల్ వేసిన బంతిని బవుమా ఆడగా బంతి మొదటి స్లిప్ దిశగా దూసుకుపోయింది. ఆ స్థానంలో ఉన్న పుజారా, బంతికి అడ్డంగా కుడి వైపునకు వెళ్లి అందుకునే ప్రయత్నం చేసిన కీపర్ పంత్ క్యాచ్ వదిలేశారు. పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్‌ను తాకింది. దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు అంపైర్ 5 అదనపు పరుగులు అందించాడు.
ఇదిలా ఉంటే.. మయాంక్ అగర్వాల్ సైతం బంతి బౌండరీ చేరకుండా సులువుగా ఆపే పరిస్థితి ఉన్నా విఫలమయ్యాడు. బాల్‌ను అందుకున్నప్పటికీ బ్యాలన్స్ చేసుకోలేక రోప్‌ను తాకడంతో బ్యాటర్‌కు నాలుగు పరుగులు లభించాయి. దీంతో కెప్టెన్ కోహ్లి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మయాంక్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
34వ ఓవర్‌లో పీటర్సన్‌కు బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘తను ఈజీగా బంతిని వెనక్కి నెట్టి ఉండవచ్చు. కానీ అలా జరుగలేదు. కెప్టెన్ ఇలా అసహనానికి గురికావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు