Ind Vs Sa 3rd Test: దక్షిణాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించాలంటే మూడో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే ఇన్నాళ్లుగా భారత జట్టుకు సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, గాయాల బెడద కోహ్లి సేనకు పెద్ద తలనొప్పిగా మారింది. వెన్ను నొప్పి కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నా ఆఖరి నిమిషం వరకు ఎటూ చెప్పలేని పరిస్థితి. ఇక కీలక ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.
వీటికి తోడు మిడిలార్డర్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాడు అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం.. ఈ వికెట్ కీపర్‌ను జట్టులో కొనసాగించాలని అంటున్నాడు.
ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ లాంటి ఆటగాడిని మేనేజ్‌మెంట్ పక్కన పెడుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే టీమిండియాకు తనే ఎక్స్ ఫ్యాక్టర్. మ్యాచ్ విన్నర్. షాట్ సెలక్షన్ గురించి కెప్టెన్ విరాట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో మాట్లాడితే సరిపోతుంది. కేవలం కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే వృద్ధిమాన్ సాహా పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. కానీ... బ్యాటింగ్‌లో పంత్ ఎన్నో మెట్లు పైనే ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక కాస్త కఠిన నిర్ణయమే అయినా... హనుమ విహారిని తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో అతడు బాగానే ఆడినా.. పుజారా, రహానే అర్ధ సెంచరీలతో రాణించడంతో వాళ్లు కచ్చితంగా మూడో టెస్టు తుది జట్టులో ఉంటారని పేర్కొన్నాడు. విరాట్ వస్తున్నాడు కాబట్టి... విహారిపై వేటు తప్పదన్నాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు వసీం జాఫర్ ఎంచుకున్న తుదిజట్టు:
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.
చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్!
Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు.. కచ్చితంగా గెలిచి తీరతాం!
Comments
Please login to add a commentAdd a comment