పార్ల్: గత ఏడేళ్లుగా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలనందించి.. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టిన విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్ హోదాలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ, సహచరులకు సూచనలు ఇస్తూ కనిపించిన కోహ్లి.. ఇకపై మైదానంలో మరో కెప్టెన్ మాట వినాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అందరి చూపు కోహ్లిపైనే ఉండనంది.
కాగా, దక్షిణాఫ్రికాతో రేపు జరగనున్న తొలి వన్డేలో కోహ్లి మరిన్ని విషయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువబోతున్నాడు. దిగ్గజ క్రికెటర్లైన సచిన్, ద్రవిడ్, గంగూలీల రికార్డులకు అతి చేరువలో ఉన్నాడు. రేపటి మ్యాచ్‌లో శతకం సాధిస్తే, క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్(100) తర్వాతి స్థానానికి చేరుకోనున్న కోహ్లి(71).. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకుంటాడు. ఈ ఫీట్ ద్వారా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డేల్లో ఏబీ డివిలియర్స్(6) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం కోహ్లి సఫారీలపై 5 వన్డే శతకాలు నమోదు చేశాడు.
దక్షిణాఫ్రికాపై వన్డేల్లో 1287 పరుగులు చేసిన కోహ్లి.. మరో 27 పరుగులు చేస్తే.. ద్రవిడ్(1309), గంగూలీ(1313)లను అధిగమిస్తాడు. ఈ జాబితాలో సచిన్ 2001 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లిని మరో రికార్డు కూడా ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో కోహ్లి(887) మరో 171 పరుగులు చేస్తే.. సఫారీ గడ్డపై సచిన్(1453), పాంటింగ్(1432) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.
అలాగే మరో 113 పరుగులు చేస్తే.. నాలుగు అంతకంటే ఎక్కువ దేశాల్లో 1000కిపైగా పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. భారత్‌లో 4994 పరుగులు చేసిన కోహ్లి, ఇంగ్లండ్‌లో 1316, ఆస్ట్రేలియాలో 1327 పరుగులు స్కోర్ చేశాడు. కాగా, కోహ్లి చివరిసారిగా అంతర్జాతీయ సెంచరీ సాధించి దక్షణాఫ్రికాతో తొలి వన్డే నాటికి 788 రోజులవుతోంది.
చదవండి: కోహ్లి దిగిపోయాడు.. రోహిత్ వచ్చేస్తున్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment