
Ind Vs Sa- VVS Laxman: చేసిన తప్పులే మళ్లీ మళ్లీ.. ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి! అలా అయితేనే..
Ind Vs Sa: VVS Laxman On Important Not Repeat Same Mistakes Rahane Pujara: తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా పదే పదే.. ఒకే తరహాలో వికెట్ పారేసుకోవడం సరికాదని టీమిండియా బ్యాటర్లకు వీవీఎస్ లక్ష్మణ్ చురకలు అంటించాడు. తప్పిదాలను గమనించి వాటిని పునరావృతం చేయకుండా ఉండాలని హితవు పలికాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టుకు సారథిగా వ్యవహరించిన రహానే తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో రెండో టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు.
మరోవైపు.. పుజారాకు ముంబై టెస్టులో ఛాన్స్ వచ్చినా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా వీరు అవుటైన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రహానే, పుజారా ఆట తీరుపై పెదవి విరిచాడు. ‘‘ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేయకూడదు. కాన్పూర్ టెస్టులో అజింక్య రహానే అవుటైన విధానం.. పుజారా కాన్పూర్, ముంబై టెస్టులో పెవిలియన్ చేరిన తీరును గమనిస్తే విషయం అర్థమవుతుంది. ఒకే తరహాలో వారు వికెట్ పారేసుకున్నారు’’ అని పేర్కొన్నాడు.
అదే విధంగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘గిల్ కూడా అంతే... కాస్త కుదురుకున్నాడు అనుకునే సమయానికి అవుట్ అవుతాడు. శుభారంభాలను భారీ స్కోరుగా మార్చడం చాలా చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఈ లోపాలు సరిదిద్దుకుని... కసిగా ఆడితేనే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా సౌతాఫ్రికాకు పయనం కానుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: Virat Kohli- Ajinkya Rahane: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్!