
కొలంబో: శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టును ఢీకొట్టబోయే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. జూలై 18 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం 25 మంది సభ్యులతో కూడి జంబో జట్టును ఎంపిక చేసింది. సిరీస్ మొత్తానికి డసన్ షనకను నూతన సారధిగా ఎంపిక చేసింది. గడిచిన నాలుగేళ్లలో శ్రీలంకకు షనక ఆరో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. 2018 నుంచి దినేశ్ చండీమాల్, ఎంజెలో మాథ్యూస్, లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే, కుశాల్ పెరీరా కెప్టెన్లుగా వ్యవహరించారు. మరోవైపు గాయం కారణంగా మాజీ కెప్టెన్ కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.
కాగా, షనక 2019లో తొలిసారి శ్రీలంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారధ్యంలో పాకిస్థాన్‌పై టీ20 సిరీస్ విజయాన్నందించాడు. అనంతరం వెస్టిండీస్ పర్యటనకు కూడా ఎంపికైనప్పటికీ వీసా సమస్య కారణంగా వెళ్లలేకపోయాడు. ఇక భారత్‌తో సిరీస్‌లకు ధనుంజయ డిసిల్వా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో టీ20, వన్డే సిరీస్‌ల్లో చిత్తుగా ఓడిన శ్రీలంక జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. దీనికి తోడు జట్టులో కరోనా కేసులు, బోర్డుతో కాంట్రాక్ట్ వివాదం వంటివి జట్టును కుదుపునకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌లో ఏమేరకు ప్రభావం చూపగలుగుతుందోనని ఆ దేశ అభిమానలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో స్టార్ ప్లేయర్లు కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్ వెల్లా, ధనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనలను అధిగమించి నిషేధానికి గురయ్యారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతుంది. మరోవైపు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ల విషయంలోనూ వివాదం నడుస్తోంది. చివరకు 29 మంది ఆటగాళ్లు కాంట్రాక్టులపై సంతకాలు చేసినప్పటికీ సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ వ్యక్తిగత కారణాలతో భారత్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు.
శ్రీలంక జట్టు: డసన్ షనక(కెప్టెన్), ధనుంజయ డిసిల్వా(వైస్ కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, వానిందు హరసరంగ, యాషెన్ బండార, మినొద్ భానుక, లాహిరు ఉడారా, రామేశ్ మెండీస్, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షణ్ సందకన్, అకిలా ధనుంజయ, షిరన్ ఫెర్నాండో, ధనుంజయ లక్షణ్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రెమా, అసితా ఫెర్నాండో, కసున్ రజితా, లాహిరు కుమార, ఇసురు ఉడాన