
కొలంబో: నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో ఎక్‌స్ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సైనీ గాయపడ్డాడు. కరుణరత్నే కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకునే ప్రయత్నంలో బలంగా కిందపడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం అతడిని మైదానం నుంచి తీసుకెళ్లి చికిత్స అందించింది. గాయం తీవ్రంగా ఉండడంతో నేటి నిర్ణయాత్మక మ్యాచ్ నుంచి అతను తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అసలే ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతున్న సమయంలో సైనీ గాయం టీమిండియాను మరింత ఇబ్బంది పెడుతోంది. కనీసం పదకొండు మంది ఆటగాళ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం భారత జట్టులో నెలకొంది. కాగా, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో అతనితో పాటు ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఐసోలేషన్‌ను తరలించబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌కు స్టాండ్ బై ప్లేయర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. సిరీస్ డిసైడర్ అయిన నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్న భారత్‌కు సైనీ గాయం తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్‌లో సైనీ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సాయి కిషోర్‌తో పాటు అర్షదీప్ సింగ్ మాత్రమే ప్రస్తుతం టీమిండియా బెంచ్‌పై ఉన్నారు.