
వ్యక్తిగత కారణాల చేత వెస్టిండీస్‌తో తొలి వన్డేకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో వన్డేకు రెడీ అయ్యాడు. అతనితో పాటు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీలు సోమవారం అహ్మదాబాద్‌లోని టీమిండియా క్యాంపులో చేరారు. బుధవారం జరగనున్న రెండో వన్డే కోసం ఈ ముగ్గురు ప్రత్యేకంగా నెట్స్‌లో చెమటోడ్చారు. ‘ఎవరొచ్చారో చూడండి.. ఈ ముగ్గురు జట్టుతో చేరారు. సోమవారం ప్రాక్టీస్ సెషన్‌లో చెమటోడ్చారు’ అని బీసీసీఐ ఈ ముగ్గురి ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. బీసీసీఐ ప్రత్యేకంగా ఈ ముగ్గురి ఫోటోలను షేర్ చేయడం బట్టి చూస్తే, రెండో వన్డేలో వీరు తుది జట్టులో ఉండటం ఖాయంగా తెలుస్తోంది.
Look who are here! 🙌
— BCCI (@BCCI) February 7, 2022
The trio has joined the squad and sweated it out in the practice session today. 💪#TeamIndia | #INDvWI | @Paytm pic.twitter.com/Nb9Gmkx98f
కాగా, విండీస్‌తో తొలి వన్డేకు ముందు శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, బ్యాకప్ ప్లేయర్ సైనీలతో పాటు నలుగురు సహాయక సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో సైనీ ఐసోలేషన్ పూర్తి చేసుకుని జట్టుతో చేరగా.. ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడు రోజుల క్వారంటైన్ ముగించుకుని గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టీమిండియా తమ 1000వ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని 176 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు.
చదవండి: స్వదేశంలో యశ్ ధుల్ సేనకు ఘన స్వాగతం.. ఉబ్బి తబ్బిబ్బయిన యువ క్రికెటర్లు