![Ind Vs WI Rohit Sharma Eye Catching Tweet Goes Viral As Rain Washes Out 2nd Test - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/rohit-sharma.jpg.webp?itok=0IJc2hmV)
West Indies vs India, 2nd Test: కాస్త కష్టపడితే చాలు గెలుపు ఖాయమనుకున్న తరుణంలో వాన దేవుడు టీమిండియా ఆశలపై నీళ్లు కుమ్మరించిన విషయం తెలిసిందే. కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌కు అంతరాయం కలిగించి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో తొలి సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయాలన్న రోహిత్ సేనకు నిరాశ మిగిల్చాడు. తద్వారా కీలక డబ్ల్యూటీసీ పాయింట్లను కూడా కోల్పోయేలా చేశాడు.
విజయం పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తే..
కాగా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన విషయం విదితమే. డొమినికాలో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచి విజయం పరిపూర్ణం చేసుకోవాలని భావించింది.
అందుకు తగ్గట్లుగానే మెరుగైన ఆట తీరుతో విండీస్‌ను కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బజ్‌బాల్‌ను మించిన ఆటతో ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టు ముందు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐదో రోజు ఆటలో విజయానికి టీమిండియా 8 వికెట్ల దూరంలో ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది.
వరణుడి దెబ్బ
ఎడతెరిపి లేని వాన కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే కథ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగియగా.. భారత్‌కు నాలుగు పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించిన నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
రోహిత్ శర్మ ట్వీట్ వైరల్
సహచర ఆటగాళ్లతో కలిసి ఆకాశంకేసి చూస్తున్న ఫొటోను పంచుకున్న రోహిత్.. ‘‘ఇది ముంబైనా లేదంటే ట్రినిడాడా?’’ అంటూ ఎమోజీలు జతచేసి ఆశ్చర్యం ప్రదర్శించాడు. కాగా దేశ వాణిజ్య రాజధానిలో వానలు దంచికొడుతున్న వేళ ఈ ముంబై బ్యాటర్ ఈ మేరకు చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో సెంచరీ(103)తో మెరిసిన రోహిత్.. రెండో టెస్టులో వరుస అర్ధ శతకాల(80, 57)తో ఆకట్టుకున్నాడు.
చదవండి: ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడు! పర్లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితే..
'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
Mumbai ya Trinidad 🤔🌧️ pic.twitter.com/jOPINPXW4a
— Rohit Sharma (@ImRo45) July 25, 2023
Comments
Please login to add a commentAdd a comment