ICC World Test Championship- 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కరేబియన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా.. అరంగేట్ర బ్యాటర్ యశస్వి జైశ్వాల్ 171 పరుగులతో చెలరేగాడు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాపర్
ఈ నేపథ్యంలో భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. జూలై 12న మొదలై మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఈ విజయం ద్వారా 12 పాయింట్లు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానం ఆక్రమించింది. అయితే, దాయాది జట్టు కూడా రోహిత్ సేనను అనుసరించడం విశేషం.
పాక్ కూడా మనవెంటే
కాగా పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో బాబర్ ఆజం బృందం 4 వికెట్ల తేడాతో గెలిచింది. జూలై 16న మొదలై ఐదురోజుల పాటు సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య లంకను చిత్తు చేసింది.
కాగా పాక్‌కు కూడా తాజా డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇదే తొలి మ్యాఛ్ కావడం విశేషం. దీంతో.. 12 పాయింట్లతో టీమిండియాతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో భాగంగా.. ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన చాంపియన్ ఆస్ట్రేలియా.. రెండింట గెలిచి.. ఒక మ్యాచ్‌లో ఓడింది.
చాంపియన్ ఎక్కడంటే
ఈ క్రమంలో 22 పాయింట్లు(61.11శాతం) సాధించి మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 10 పాయింట్ల(పెనాల్టీ పడటం వల్ల రెండు పాయింట్లు మైనస్)తో నాలుగోస్థానంలో ఉంది. మిగతా జట్లలో శ్రీలంక, వెస్టిండీస్ ఒక్కో ఓటమితో టాప్ 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మిగతా వాటిలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఇంకా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు గురువారం మొదలుకాగా.. జూలై 24 నుంచి శ్రీలంక- పాక్ రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్!
Comments
Please login to add a commentAdd a comment