India tour of West Indies, 2023: ‘‘ఇండియాలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు ఎప్పుడెప్పుడు అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడతారా అని ఎదురుచూడటం తప్ప మనమేం చేయలేం. నా దృష్టిలో యశస్వి జైశ్వాల్ మాదిరే రుతురాజ్ గైక్వాడ్ కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు.
టెస్టుల్లో అతడు గొప్పగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. రానున్న రెండేళ్లలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో అతడు కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం. వీరితో పాటు భారత ఓపెనర్ పృథ్వీ షా కూడా అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్. అదే విధంగా సర్ఫరాజ్ కూడా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ అన్నాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌ను ప్రశంసిస్తూనే రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.
అరుదైన రికార్డులు సాధించి
కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భాగంగా టీమిండియా వెస్టిండీస్‌తో తమ తొలి సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టు సందర్భంగా ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశాడు. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అద్భుత శతకం(171)తో అలరించాడు.
టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన రికార్డులెన్నో సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా విండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్న మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం నిరాశే ఎదురైంది.
రుతు బెంచ్‌కు పరిమితం
కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో రుతు బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐసీసీ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. యశస్వి ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాడని కొనియాడాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడి రాత్రి రాత్రే సూపర్‌స్టార్‌గా మారిపోయాడన్నాడు.
రుతురాజ్‌కు కూడా ఛాన్స్ ఇస్తే
అతడు మంచి బ్యాటర్ అని అందరికీ తెలుసని, అయితే ఈ సీజన్‌లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా తనలోని అన్ని రకాల టాలెంట్స్ ప్రదర్శించాని యశస్విపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌కు కూడా వరుస అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.
ఇద్దరూ అదరగొట్టారు
కాగా ఐపీఎల్-2023 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 14 మ్యాచ్‌లలో ఓ సెంచరీ(124) సాయంతో 625 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచ్‌లు ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విజయంతో 1-0తో ముందంజ వేసిన టీమిండియా జూలై 20 నుంచి విండీస్‌తో రెండో టెస్టులో తలపడనుంది.
చదవండి: బీసీసీఐకి థాంక్స్.. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్ రుతురాజ్
Comments
Please login to add a commentAdd a comment