IND Vs ZIM 3rd ODI Robin Uthappa: Unfair If Gaikwad Tripathi Don't Get Game - Sakshi
Sakshi News home page

Ind Vs Zim: పాపం.. కనీసం ఆఖరి వన్డేలోనైనా వాళ్లిద్దరికీ అవకాశం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే!

Published Sun, Aug 21 2022 1:53 PM | Last Updated on Sun, Aug 21 2022 2:41 PM

Ind Vs Zim 3rd ODI Robin Uthappa: Unfair If Gaikwad Tripathi Dont Get Game - Sakshi

జింబాబ్వేతో టీమిండియా వన్డే సిరీస్‌(PC: BCCI)

India tour of Zimbabwe, 2022- 3rd ODI: అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం కోసం రాహుల్‌ త్రిపాఠి... వన్డేల్లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చేందుకు యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 31 ఏళ్ల రాహుల్‌ త్రిపాఠి తొలిసారి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో జాతీయ జట్టుకు ఎంపికైనా తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.

ప్చ్‌.. రుతురాజ్‌ కూడా!
ఇక గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టిన రుతు.. వన్డేల్లో ఆడే అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. గతేడాది టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కాగా టీమిండియా జింబాబ్వే పర్యటన నేపథ్యంలో వీరిద్దరికి బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో ఇరు ఆటగాళ్ల అభిమానులు సంబరపడ్డారు. 


రాహుల్‌ త్రిపాఠి- రుతురాజ్‌ గైక్వాడ్‌(PC: BCCI)

కానీ, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో వీరిద్దరికీ నిరాశే ఎదురైంది. ఓపెనర్ల విభాగంలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లు అందుబాటులో ఉండటంతో రుతురాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. 

అవకాశం దక్కుతుందా!
అదే విధంగా సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా వంటి బ్యాటర్లు ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో రాహుల్‌ త్రిపాఠిని పరిగణనలోకి తీసుకునే అవసరమే రాలేదు. అయితే, ఇప్పటికే మొదటి, రెండు వన్డేల్లో వరుసగా 10 వికెట్లు, ఐదు వికెట్ల తేడాతో జింబాబ్వే మీద రాహుల్‌ సేన గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో నామమాత్రపు మూడో వన్డేలోనైనా వీరికి అవకాశం దక్కుతుందేమోనని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.


రాబిన్‌ ఊతప్ప(PC: BCCI)

ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడో వన్డేలో రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠికి తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం అన్యాయమే అవుతుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా- జింబాబ్వే మధ్య ఆఖరి వన్డేకు ముందు ఈ మేరకు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ షోలో రాబిన్‌ ఊతప్ప తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

అన్యాయం చేసినట్లే!
‘‘మూడో వన్డేలో భాగంగా దీపక్‌ చహర్‌ తిరిగి జట్టులోకి వస్తాడు. ప్రసిద్‌ కృష్ణకు విశ్రాంతినిస్తే.. ఆవేశ్‌ ఖాన్‌ జట్టులోకి రావొచ్చు. సిరాజ్‌కు కూడా బ్రేక్‌ ఇచ్చి శార్దూల్‌ను ఆడించొచ్చు. ఫాస్ట్‌బౌలర్లను రొటేషన్‌ విధానంలో ఆడించేందుకు వాళ్లు సిద్ధమయ్యారు కాబట్టి మనం ఈ మార్పులు చూడొచ్చు.

ఇక బ్యాటింగ్‌ విభాగానికొస్తే... నాకు తెలిసి మేనేజ్‌మెంట్‌ మరీ ఎక్కువ మార్పులు చేయకపోవచ్చు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌కు అరంగేట్రం చేసే అవకాశం రావొచ్చు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి సైతం అరంగేట్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వాళ్లిద్దరికీ అవకాశం రాలేదంటే అన్యాం జరిగినట్లే!’’ అని ఊతప్ప పేర్కొన్నాడు.

ఈ పర్యటన తర్వాత..
ఇదిలా ఉంటే.. వాషింగ్టన్‌ సుందర్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో షాబాజ్‌ అహ్మద్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ. కాగా హరారే వేదికగా సోమవారం(ఆగష్టు 22) టీమిండియా- జింబాబ్వే మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు జింబాబ్వే పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత ఆసియా కప్‌-2022 టోర్నీలో ఆగష్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

చదవండి: Sanju Samson: అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా అంతే! నాకైతే గొప్పగా అనిపిస్తోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement