
ఆస్ట్రేలియాతో జరగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో టీమిండియా టాపర్డర్ కుప్పకూలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. ఇక టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‍మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లి (14) దారుణంగా నిరాశపరిచారు.
అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(48) కౌంటర్ అటాక్ చేయడంతో టీమిండియా 150 మార్క్ అయినా దాటగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. 327/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో 142 పరుగులు ఆదనంగా చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ శతకాలతో చెలరేగారు.
భారం మొత్తం అతడిపైనే..
ఇక 151 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడిన టీమిండియాను గట్టెక్కించే భారమంతా సీనియర్ రహానేపైనే ఉంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్న ఈ వెటరన్ ఆటగాడు కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం మరోసాకి ఏర్పడింది. దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన రహానే.. తన అనుభవాన్ని నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం.
మరో బ్యాటర్ భరత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను రహానే తీసుకోవాలి. కనీసం తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు మార్క్‌ను భారత జట్టు అందుకుంటే.. ఆసీస్‌కు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాగా ఈ మ్యాచ్‌లో రహానేకు ఇప్పటికే ఓ ఛాన్స్ కూడా లభించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కమిన్స్ బౌలింగ్‌లో రహానే ఎల్బీడబ్ల్యూ అయినా... అదృష్టవశాత్తూ అది నోబాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఈ అవకాశాన్ని రహానే సద్వినియోగపరుచుకుంటాడో లేదో వేచి చూడాలి.
చదవండి: WTC Final: వాళ్లకేమో అలా.. మనకెందుకిలా?!