భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ప్రాతిష్టత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ఆరంభం కానుంది.
అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒకదానికి రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చని ఓ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవసరమైతే తొలి రెండు టెస్టుల నుంచి కూడా హిట్‌మ్యాన్ తప్పుకునే అవకాశముందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
"ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏదో ఒక టెస్టుకు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి అతడు తెలియజేశాడు. బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది.
అయితే రోహిత్ ఏ టెస్టుకు దూరమవుతాడన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత సమస్య పరిష్కారమైతే రోహిత్ అన్ని టెస్టులు ఆడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందని" ఓ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే అతడి స్ధానంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌కు చోటు దక్కే అవకాశముంది. అభిమన్యు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment