టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా రేపు (నవంబర్ 2) టీమిండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ ఇరు జట్లు చెరి 3 మ్యాచ్‌లు ఆడి తలో రెండేసి విజయాలతో (4 పాయింట్లు) పాయింట్ల పట్టికలో సమంగా నిలిచాయి. సెమీస్‌కు రేసులో నిలవాలంటే రేపు అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది.
ఇదిలా ఉంటే, టీమిండియాతో కీలక సమరానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ మారాయి. ఇవాళ (నవంబర్ 1) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్‌మీట్ సందర్భంగా షకీబ్ మాట్లాడుతూ.. రేపటి మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్ అని.. అయితే ఆ జట్టును ఓడించేందుకు తాము వంద శాతం కృషి చేస్తామని పేర్కొన్నాడు. తాము ఆస్ట్రేలియాకు వచ్చింది వరల్డ్‌కప్ గెలిచేందుకు కాదన్న పరిస్థితుల నడుమ.. భారత్‌ను ఓడిస్తే అదే తమకు వరల్డ్‌కప్‌తో సమానమని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వరల్డ్‌కప్‌లో ఇకపై తమకు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ప్రత్యర్ధి ఎవరనదే తాము పట్టించుకోమని, జట్టుగా వంద శాతం పెర్ఫార్మ్ చేయడంపైనే దృష్టి సారించామని అన్నాడు. ఐర్లాండ్, జింబాబ్వే లాంటి జట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి పెద్ద జట్లకు షాకివ్వగా లేనిది, తాము భారత్, పాకిస్తాన్‌లలో ఏదో ఒక జట్టును అప్‌సెట్ చేయలేమా అని ధీమా వ్యక్తం చేశాడు.
పేపర్‌పై రెండు జట్లు తమ కంటే బలమైన జట్లే అయినప్పటికీ, తమను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఫలితం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. టీమిండియా ఇక్కడికి వరల్డ్‌కప్ గెలిచేందుకు వచ్చింది, అలాంటి జట్టును ఓడిస్తే అదే తమకు పదివేలని, ఇందు కోసం తాము సర్వ శక్తులు ఒడ్డుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షకీబ్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, అతనో వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని, అతన్ని కంట్రోల్ చేయగలిగితే తమ పని సులువవుతుందని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment