టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో తమ తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-8 రౌండ్‌ను విజయంతో ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకున్న భారత జట్టు తీవ్రంగా శ్రమించింది.
అఫ్గాన్‌తో అంత ఈజీ కాదు..
అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు. ఒకప్పుడు అఫ్గాన్ వేరు ఇప్పుడు అఫ్గాన్ వేరు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టును మట్టికరిపించిన అఫ్గాన్.. భారత్, ఆస్ట్రేలియా వంటి వరల్డ్‌క్లాస్ జట్లకు సవాలు విసిరేందుకు సిద్దమైంది.
అఫ్గాన్ గ్రూపు-స్టేజిలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. సూపర్-8 రౌండ్ గ్రూపు-1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్గానిస్తాన్ చోటు దక్కించుకుంది.
అఫ్గాన్ బలాలు, బలహీనతలు..
అఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే అఫ్గాన్ ప్రధాన బలం బౌలింగ్ అనే చెప్పాలి. అఫ్గాన్ జట్టులో అద్బుతమైన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉన్నారు. ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజిలో వెస్టిండీస్‌పై మినహా మిగితా మూడు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ బౌలర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు.
తొలి మ్యాచ్‌లో ఉగండాను కేవలం 58 పరుగులకే ఆలౌట్ చేసిన రషీద్ సేన.. అనంతరం వరల్డ్‌క్లాస్ కివీస్‌ను 75 పరుగులకే అఫ్గాన్ బౌలర్లు కుప్పకూల్చారు. ఆ తర్వాతి మ్యాచ్‌లో పపువా న్యూగినిను 95 పరుగులకే కట్టడి చేశారు.
ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫరూఖీ తన కెరీర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఫరూఖీ 12 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
అతడితో పాటు మరో పేసర్ నవీన్ ఉల్ హాక్ తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సత్తాచాటుతున్నారు. అయితే స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం అఫ్గాన్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.
ముజీబ్ ఉర్ రెహ్మన్ స్ధానంలో నూర్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. నూర్‌కు కూడా తన స్పిన్‌మయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడిచేసే సత్తా ఉంది.
ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ సంచలన ఫామ్‌లో ఉన్నారు. వారు మరోసారి చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. వీరిద్దరితో పాటు గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా వంటి ఆల్‌రౌండర్లు సైతం బ్యాట్‌తో పర్వాలేదన్పిస్తున్నారు.
అయితే అఫ్గాన్‌కు ఉన్న ఏకైక బలహీనత మిడిలార్డర్. అఫ్గాన్ బ్యాటింగ్ విభాగంలో మిడిలార్డర్ అంత పటిష్టంగా కన్పించడం లేదు. నజీబ్ జద్రాన్, కరీం జనత్, నబీ వంటి వారు తమ స్ధాయికి దగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. మరి సూపర్-8లోనైనా వీరు ముగ్గురూ తమ బ్యాట్‌కు పనిచెబుతారో లేదో వేచి చూడాలి. ఇక చివరగా అఫ్గానిస్తాన్‌ను తక్కువగా అంచనా వేస్తే భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోక తప్పదు.
కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?
కాగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. గ్రూపు స్టేజిలోకి దారుణమైన ప్రదర్శన కనబరిచిన కోహ్లి.. సూపర్-8లోనైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో కూడా దాదాపు రెండేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కింగ్ కోహ్లి.. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్‌పైనే తన రిథమ్‌ను తిరిగి పొందాడు.
ఆ మ్యాచ్‌లో విరాట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో మళ్లీ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో జరగనున్న నేపథ్యంలో విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని కింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment