
చెన్నై: ఇంగ్లండ్‌తో చెపాక్ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో పరాజయంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. తమ వైపు నుంచి తప్పిదాలు జరిగిన మాట వాస్తమేనని, ప్రత్యర్థి జట్టు నిలకడగా ఆడి భారీ లక్ష్యాన్ని విధించిందంటూ ఓటమిని అంగీకరించాడు. బౌలింగ్ పరంగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై కావాల్సినంత ఒత్తిడి పెట్టకలేకపోయామని పేర్కొన్నాడు. స్లో వికెట్ కారణంగా బౌలర్లకు పిచ్ అంతగా సహకరించలేదన్న కోహ్లి.. ఫస్ట్ ఇన్నింగ్స్ తొలి అర్ధభాగంలో బ్యాట్స్‌మెన్ బాగానే రాణించారన్నారు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఏదేమైనా తమ ప్రదర్శన స్థాయికి తగ్గట్లుగా లేదని అంగీకరించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు అద్భుతంగా ఆకట్టుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని కోహ్లి పేర్కొన్నాడు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని, రానున్న మూడు టెస్టుల్లో గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయమని స్పష్టం చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మైదానంలో పంత్ వ్యవహరించిన తీరుపై స్పందిస్తూ.. అతడికి మైదానంలో సరదాగా ఉండటం ఇష్టమని, తనతో పాటు ఇతరులను కూడా నవ్విస్తూ గంభీర వాతావరణాన్ని తేలిక చేశాడన్నాడు.
ఇక ముందు కూడా ఇలాంటివి కొనసాగుతాయని కోహ్లి తెలిపాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 578, రెండో ఇన్నింగ్స్ 178 ఆలౌట్ కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ 337 ఆలౌట్, 192 ఆలౌట్ అయి రెండో ఇన్నింగ్స్ ముగించింది. దీంతో 227 పరుగుల తేడాతో కోహ్లి సేన భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక వ్యక్తిగతంగా, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి, రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో రాణించాడు. కాగా ఫిబ్రవరి 13 నుంచి చెన్నైలోనే రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: ఏంటిది రహానే.. ఇలా చేశావు?
Comments
Please login to add a commentAdd a comment