యువ భారత్‌దే టెస్టు సిరీస్‌ | India won by an innings of 120 runs against the Australian Under 19 team | Sakshi
Sakshi News home page

యువ భారత్‌దే టెస్టు సిరీస్‌

Published Thu, Oct 10 2024 4:08 AM | Last Updated on Thu, Oct 10 2024 7:20 AM

India won by an innings of 120 runs against the Australian Under 19 team

ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టుపై ఇన్నింగ్స్‌ 120 పరుగుల తేడాతో ఘనవిజయం

తిప్పేసిన అన్‌మోల్‌జీత్, ఇనాన్‌  

చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన యువ భారత్‌ జట్టు అదరగొట్టింది. ఆ్రస్టేలియా అండర్‌–19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్‌ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల యూత్‌ సిరీస్‌ను టీమిండియా 2–0తో కైవసం చేసుకుంది. అంతకుముందు యూత్‌ వన్డేల్లోనూ ఆ్రస్టేలియాను క్లీన్‌స్వీప్‌ చేసిన యువ భారత్‌... సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత బౌలర్ల ధాటికి మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగియగా... బుధవారం ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం.

ఓవర్‌నైట్‌ స్కోరు 142/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు చివరకు 80.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ ఒలీవర్‌ పెక్‌ (199 బంతుల్లో 117;16 ఫోర్లు, ఒక సిక్స్‌) సెంచరీతో రాణించగా... అలెక్స్‌ లీ యాంగ్‌ (66; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 166 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ జోడీ విడిపోయాకా ఆసీస్‌ ప్లేయర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. 59 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ చివరి 6 వికెట్లు కోల్పోయింది. 

భారత బౌలర్లలో మొహమ్మద్‌ ఇనాన్, అన్‌మోల్‌జీత్‌ సింగ్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో యువ భారత జట్టుకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. దీంతో ఆ్రస్టేలియా జట్టును ఫాలోఆన్‌ ఆడించింది. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన చేసి ఉన్న కంగారూలు... రెండో ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం కూడా పోరాడలేకపోయారు. 31.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకోగలిగారు.

సిమోన్‌ బడ్జ్‌ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), స్టీవెన్‌ హోగన్‌ (29;4 ఫోర్లు), పదకొండో స్థానంలో బరిలోకి దిగిన హ్యారీ హొకెస్ట్రా (20 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అన్‌మోల్‌ జీత్‌ సింగ్‌కు 5, లెగ్‌ స్పిన్నర్‌ మొహమ్మద్‌ ఇనాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు యువ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన అరంగేట్ర ఆఫ్‌ స్పిన్నర్‌ అన్‌మోల్‌జీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో అన్‌మోల్‌జీత్, ఇనాన్‌ కలిసి 16 వికెట్లు పడగొట్టడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement