Ind vs Eng Test Series 2024: హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ విమర్శించాడు. ఇంగ్లిష్ బ్యాటర్లపై తమ బౌలర్లను ప్రయోగించడంలో హిట్‌మ్యాన్ తెలివి ప్రదర్శించలేకపోయాడని పెదవి విరిచాడు.
ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు బదులు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా అసలు ఓడిపోయేదే కాదని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యం కనబరిచిన టీమిండియా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(196) జోరుకు అడ్డుకట్ట వేయలేక ఓటమిని కొనితెచ్చుకుంది.
తప్పని ఓటమి
కేవలం నాలుగు పరుగుల దూరంలో పోప్ డబుల్‌సెంచరీ చేజార్చుకున్నా.. జట్టును మాత్రం గెలిపించగలిగాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది.
తద్వారా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్సీని టీమిండియా బాగా మిస్సవుతోంది.
కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది
ఒకవేళ హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లి కెప్టెన్‌గా ఉండి ఉంటే.. భారత జట్టు ఓడిపోయేదే కాదు! రోహిత్ శర్మ దిగ్గజ ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ.. ఆరోజు ఎందుకో పూర్తిగా తనకేమీ పట్టనట్టు.. ఒక్క వ్యూహం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయాడు’’ అని యూట్యూబ్ చానెల్‌తో పేర్కొన్నాడు.
ఇక తన కాలమ్‌లోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రోహిత్ శర్మ కెప్టెన్సీ మరీ ఆవరేజ్‌గా ఉంది. మైదానంలో అతడు చురుగ్గా కదులుతూ బౌలింగ్లో మార్పులు చేస్తాడనుకున్నా. కానీ ఒలీ పోప్‌ను అవుట్ చేసేందుకు.. అతడి స్వీప్, రివర్స్ షాట్లను ఆపేందుకు రోహిత్ ఒక్కసారి కూడా సరైన వ్యూహం పన్నలేదనిపించింది’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు.
కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తొలి టెస్టులో రోహిత్ శర్మ కేవలం 63 రన్స్ మాత్రమే చేశాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: Ind vs Eng: ఆ ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు?.. టీమిండియా కోచ్ స్పందన ఇదే
Comments
Please login to add a commentAdd a comment