దీపిక కుమారిపైనే భారత్ ఆశలు
ఆర్చరీలో ఊరిస్తున్న ఒలింపిక్ పతకం
మూడు విభాగాల్లో ధీరజ్ బరిలోకి
అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం నిలకడగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించడం... ఒలింపిక్స్‌కు వచ్చేసరికి తడబడటం... భారత ఆర్చరీ గురించి ఇలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీకి తొలిసారి చోటు దక్కింది. భారత్ మాత్రం 1988 సియోల్ ఒలింపిక్స్‌తో అరంగేట్రం చేసింది. పురుషుల వ్యక్తిగత, టీమ్ విభాగంలో లింబారామ్, సంజీవ సింగ్, శ్యామ్‌లాల్ మీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లోనూ భారత ఆర్చర్లు పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే నిష్క్రమించారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఎవరూ అర్హత పొందలేదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంతోపాటు తొలిసారిగా మహిళల విభాగంలోనూ భారత్ పోటీపడింది. పురుషుల విభాగంలో సత్యదేవ్ ప్రసాద్, తరుణ్‌దీప్ రాయ్, మాఝీ సవాయన్... మహిళల విభాగంలో డోలా బెనర్జీ, రీనా కుమారి, సుమంగళ శర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
సత్యదేవ్ ప్రసాద్, రీనా కుమారి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... తరుణ్‌దీప్, మాఝీ సవాయన్, డోలా బెనర్జీ తొలి రౌండ్‌లో, సుమంగళ శర్మ రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత ఆర్చర్లు బరిలోకి దిగినా రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
గత మూడేళ్ల కాలంలో భారత ఆర్చర్లు నిలకడగా రాణించారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఐదు విభాగాల్లోనూ అర్హత సాధించారు. పురుషుల టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్... మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్, వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో... భజన్ కౌర్ మహిళల టీమ్, వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పోటీపడతారు.
40 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్, 30 ఏళ్ల దీపిక కుమారి నాలుగో సారి ఒలింపిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా దీపికా కుమారిపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్íÙప్... ఇలా అన్ని మెగా టోర్నీల్లో పతకాలు గెల్చుకున్న దీపిక ఖాతాలో కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది. ఈ ఏడాది దీపిక మంచి ఫామ్‌లో ఉంది.
షాంఘై ప్రపంచకప్ టోర్నీ లో రజత పతకం సాధించగా... ఆసియా కప్‌లో స్వర్ణ పతకం గెలిచింది. ఓవరాల్ గా దీపిక ప్రపంచకప్ టోర్నీ ల్లో 37 పతకాలు... ప్రపంచ చాంపియన్íÙప్‌లో ఐదుపతకాలు సాధించి భారత అత్యుత్తమ ఆర్చర్‌గా పేరు తెచ్చుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో దీపిక తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన అవసరం ఉంది.
కీలకదశలో ఒత్తిడికి తడబడి గురి తప్పడం దీపిక బలహీనతగా ఉంది. అయితే మూడు ఒలింపిక్స్‌లలో పోటీపడ్డ దీపిక ఈ బలహీనతను పారిస్‌లో అధిగమిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పారిస్ గేమ్స్ నుంచి దీపిక పతకంతో తిరిగొస్తే భారత్‌లో ఆర్చరీకి మరింత ఆదరణ పెరుగుతుంది.
విజయవాడకు చెందిన 22 ఏళ్ల ధీరజ్ కూడా కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ పారిస్ గేమ్స్‌లో తన నుంచీ పతకం ఆశించవచ్చని ఆశలు రేకెత్తిస్తున్నాడు. గత రెండేళ్లలో ధీరజ్ ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గాడు. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్íÙప్‌లో, ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఐదు పతకాలు సాధించాడు.
తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ధీరజ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పతకంతో తిరిగొస్తే భారత ఆర్చరీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ ఈవెంట్ జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఆర్చరీలో కాంపౌండ్, రికర్వ్ అని రెండు కేటగిరీలున్నా... ఒలింపిక్స్‌లో మాత్రం కేవలం రికర్వ్ విభాగంలోనే పోటీలు నిర్వహిస్తారు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment