కుర్రాళ్లు నిలవలేకపోయారు... | The Indian team lost in the first T20 | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లు నిలవలేకపోయారు...

Jul 7 2024 4:22 AM | Updated on Jul 7 2024 11:06 AM

The Indian team lost in the first T20

తొలి టి20లో ఓడిన భారత జట్టు 

13 పరుగులతో జింబాబ్వే విజయం 

నేడు రెండో టి20 మ్యాచ్‌  

ఐపీఎల్‌ అనుభవంతో జింబాబ్వే గడ్డపై అడుగు పెట్టిన భారత యువ బృందం  అంతర్జాతీయ వేదికపై ఆ మెరుపులు చూపించలేకపోయింది. తమతో పోలిస్తే టి20 క్రికెట్‌లో తక్కువ అనుభవం ఉన్న బలహీన ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాపై విజయాన్ని నమోదు చేసింది. 

తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో సొంత అభిమానుల్లో ఆనందం పంచింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గెలిచిన టీమ్‌లోని ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా... అధికారిక రికార్డుల ప్రకారం వరల్డ్‌ చాంపియన్‌ అయిన తర్వాత భారత్‌కు ఇది ఓటమి!  

హరారే: సొంత గడ్డపై ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. 

క్లైవ్‌ మదాందె (25 బంతుల్లో 29 నాటౌట్‌; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా...మైర్స్‌ (23), బెన్నెట్‌ (22), మదివెరె (21) స్కోరులో తలా ఓ చేయి వేశారు. రవి బిష్ణోయ్‌ (4/13) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేయగా, సుందర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. 

శుబ్‌మన్‌ గిల్‌ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (24 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సికందర్‌ రజా (3/25), చటారా చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. రెండో టి20 నేడు ఇక్కడే జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురేల్‌ భారత్‌ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు.  

రవి బిష్ణోయ్‌కు 4 వికెట్లు... 
రెండో ఓవర్లోనే కయా (0) అవుటైనా...ఖలీల్‌ ఓవర్లో 4 ఫోర్లతో జింబాబ్వే బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఈ జోరుకు బ్రేక్‌ పడింది.  బిష్ణోయ్‌ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో స్కోరు 69/3కి చేరింది. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 74/5 వద్ద నిలిచింది. కొద్ది సేపటికే సుందర్‌ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. 

ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేసిన బిష్ణోయ్‌ కూడా మరో 2 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 100 లోపే ఆలౌట్‌ అయ్యేలా అనిపించింది. అయితే చటారా, మదాందె కలిసి తర్వాతి 27 బంతులను జాగ్రత్తగా ఆడి అభేద్యంగా 25 పరుగులు జోడించారు.  90/9 నుంచి స్కోరు 115 వరకు చేరింది. మ్యాచ్‌ తుది ఫలితంతో ఈ చివరి పరుగులే కీలకంగా మారాయి. 
 
టపటపా... 
తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ (0) నాలుగు బంతులు ఆడితే, రియాన్‌ పరాగ్‌ (2) ఆట మూడు బంతుల్లో ముగిసింది. రుతురాజ్‌ (7) విఫలం కాగా, రింకూ సింగ్‌ (0) పేలవంగా నిష్క్రమించాడు. దాంతో స్కోరు 22/4. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్‌ జురేల్‌ (6) విఫలం కావడంతో 9.5 ఓవర్లలో సగం టీమ్‌ పెవిలియన్‌కు! ఇదీ భారత జట్టు పరిస్థితి. 

మరో వైపు జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే రజా బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో 47/6 వద్ద భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సుందర్‌ పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 2 పరుగులే చేసిన జట్టు చివరి వికెట్‌ కోల్పోయింది.  

స్కోరు వివరాలు: 
జింబాబ్వే ఇన్నింగ్స్‌: మదెవెరె (బి) బిష్ణోయ్‌ 21; కయా (బి) ముకేశ్‌ 0; బెన్నెట్‌ (బి) బిష్ణోయ్‌ 22; రజా (సి) బిష్ణోయ్‌ (బి) అవేశ్‌ 17; మయర్స్‌ (సి) అండ్‌ (బి) సుందర్‌ 23; క్యాంప్‌బెల్‌ (రనౌట్‌) 0; మదాందె (నాటౌట్‌) 29; మసకద్జ (స్టంప్డ్‌) జురేల్‌ (బి) సుందర్‌ 0; జాంగ్వే (ఎల్బీ) (బి) బిష్ణోయ్‌ 1; ముజరబాని (బి) బిష్ణోయ్‌ 0; చటారా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–6, 2–40, 3–51, 4–74, 5–74, 6–89, 7–89, 8–90, 9–90.  బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–28–0, ముకేశ్‌ 3–0–16–1, రవి బిష్ణోయ్‌ 4–2–13–4, అభిõÙక్‌ 2–0–17–0, అవేశ్‌ 4–0–29–1, సుందర్‌ 4–0–11–2.  

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) మసకద్జ (బి) బెన్నెట్‌ 0; గిల్‌ (బి) రజా 31; రుతురాజ్‌ (సి) కయా (బి) ముజరబాని 7; పరాగ్‌ (సి) (సబ్‌) మవుతా (బి) చటారా 2; రింకూ సింగ్‌ (సి) బెన్నెట్‌ (బి) చటారా 0; జురేల్‌ (సి) మదెవెరె (బి) జాంగ్వే 6; సుందర్‌ (సి) ముజరబాని (బి) చటారా 27; బిష్ణోయ్‌ (ఎల్బీ) (బి) రజా 9; అవేశ్‌ (సి) రజా (బి) మసకద్జా 16; ముకేశ్‌ (బి) రజా 0; ఖలీల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 102.  వికెట్ల పతనం: 1–0, 2–15, 3–22, 4–22, 5–43, 6–47, 7–61, 8–84, 9–86, 10–102.  బౌలింగ్‌: బెన్నెట్‌ 1–1–0–1, మసకద్జ 3–0–15–1, చటారా 3.5–1–16–3, ముజరబాని 4–0–17–1, జాంగ్వే 4–0–28–1, రజా 4–0–25–3.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement