సెంచూరియన్ వేదికగా టీమిండయాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగుస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. అనంతరం బ్యాటింగ్‌లోనూ సత్తాచాటుతోంది. రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ మినహా మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. అరంగేట్ర ఆటగాడు ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
అతడితో పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ సేవలు కోల్పోయిందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
"వెటరన్ పేసర్ మహ్మద్ షమీని భారత జట్టు నిజంగా మిస్ అవుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సెంచూరియన్ వంటి వికెట్‌పై షమీ తన సీమ్‌తో అద్భుతాలు చేయగలడు. షమీ ఆడి ఉంటే ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయిపోయి ఉండేది. జస్ప్రీత్ బుమ్రా, షమీ ద్వయం ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పులు పెట్టేవారు.
శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీరిద్దరి కలిసి కేవలం 27 ఓవర్లలనే 118 పరుగులు సమర్పించుకున్నారు. సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ కొంచెం ఎక్కువగా పరుగులు ఇచ్చాడు. అయితే చివరి స్పెల్‌లో సిరాజ్ అద్భుతమైన బంతులను వేశాడు.
అతడి బౌలింగ్ చూస్తే ఒకట్రెండు వికెట్లు పడగొట్టగలడనే నమ్మకం నాకు కలిగింది. మూడో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేస్తే మ్యాచ్ మలుపు తిరగవచ్చు అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు.
చదవండి: AUS Vs PAK: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment