
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై కొన్ని నెలలుగా న్యాయ పోరాటం చేస్తున్న స్టార్ రెజ్లర్లకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ గొప్ప ఊరటనిచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు కేవలం ఒకే బౌట్ ద్వారా అర్హత పొందే అవకాశం కల్పించింది.
స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, బజరంగ్ పూనియా, జితేందర్ కిన్హాలు మిగతా సెలక్షన్ ట్రయల్స్ విజేతలతో తలపడి గెలిస్తే చాలు ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దీనికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహిస్తారు.
అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన వీరంతా కేంద్ర క్రీడాశాఖను నేరుగా ఆయా క్రీడల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో స్టార్ రెజ్లర్ల విన్నపాన్ని కేంద్ర క్రీడాశాఖ, ఐఓఏ మన్నించాయి. అయితే ఈ నామమాత్ర బౌట్‌పై ఇతర ఔత్సాహిక రెజ్లర్లు విమర్శిస్తున్నారు.