
Courtesy: ఆర్‌సీబీ ట్విటర్
రివర్స్ ప్లిక్ ఆడే దశలో ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగిన మ్యాక్స్‌వెల్
Glenn Maxwell Clean Bowled.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అదేంటి.. ఇంకా మ్యాచ్‌లే మొదలు కాలేదు.. సూపర్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ పడకండి. విషయంలోకి వెళితే.. ప్రాక్టీస్ సందర్భంగా ఆర్‌సీబీ జట్టు సూపర్ ఓవర్ సిములేషన్‌ను ఆడింది. ఒకవేళ అసలైన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రాక్టీస్ చేశారు.
రెండు జట్లుగా విడిపోయిన ఆర్‌సీబీలో టీమ్-ఏ కు షాబాజ్ అహ్మద్.. టీమ్- బి కి ఆకాశ్ దీప్ కెప్టెన్లుగా వ్యవహరించారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షాబాజ్ అహ్మద్ జట్టు 12 పరుగులు చేసింది. జట్టు తరపున బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన మ్యాక్స్‌వెల్ భారీ షాట్లు ఆడలేకపోయాడు. కాగా తన ఫేమస్ షాట్ అయిన రివర్స్ ప్లిక్ ఆడే దశలో ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోనూ 'ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్' పేరిట ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆకాశ్ దీప్ జట్టు కూడా 12 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ టైగా ముగిసింది.
చదవండి: IPL 2021 Phase 2: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
ఇక ఐపీఎల్ 13వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన మ్యాక్సీ 14.57 సగటుతో 102 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌ను వదిలేసింది. అయితే వేలంలో ఆర్‌సీబీ రూ. 14.25 కోట్లతో మ్యాక్స్‌వెల్‌ను ఎవరు ఊహించని ధరకు సొంతం చేసుకుంది. అప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో మ్యాక్స్‌వెల్ అదరగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్ మంచి ప్రదర్శననే కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు 78 పరుగులు అత్యధిక స్కోరుగా ఉంది. ఆర్‌సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసిలో ఉంది. అందుకు అనుగుణంగానే ఆర్‌సీబీ ఈసారి లీగ్‌లో అదరగొడుతుంది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో అంచె పోటీల్లో ఆర్‌సీబీ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 20న(సోమవారం) కేకేఆర్‌తో ఆడనుంది.