
ఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లాడి మూడే విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ జట్టులో టాలెంట్‌కు కొదవలేదని టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పష్టం చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉన్న పంజాబ్.. చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందన్నాడు. ‘టాప్-4కు రెండు స్థానాల దిగువన ఉంది. పాయింట్ల టేబుల్ మారుతూ ఉంటుంది. కింది స్థానాల్లో ఉన్న జట్లు కూడా పైకి వచ్చిన సందర్భాలున్నాయి.
పంజాబ్ ఒక్కసారి గాడిలో పడితే టాప్‌లోకి వస్తుంది. పంజాబ్ ఇంకా టాప్-5లో ఉన్న నాలుగు జట్లతో ఆడాల్సి ఉంది. వారిని కొడితే ప్లేఆఫ్ రేసులోకి వస్తారు. మిగిలిన ఉన్న మ్యాచ్‌ల్లో విజయంపైనే దృష్టి పెట్టండి. వారిని ఓడిస్తామా.. లేదా అనే అపనమ్మకం వద్దు. వరుసగా మ్యాచ్‌లు గెలవడం అంటే కష్టంగా అనిపిస్తుంది. కానీ అదేమీ అసాధ్యమేమీ కాదు. కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. పంజాబ్‌కు రాహుల్ దూరం కావడం లోటే. మయాంక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కెప్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వృథానే అయ్యింది’ అని అజయ్ జడేజా తెలిపాడు. గత ఏడాది సెకాండాఫ్‌లో పుంజుకున్న పంజాబ్.. వరుసగా విజయాలు సాధించింది. కానీ ప్లేఆఫ్స్ రేసుకు అడుగు దూరంలో నిలిచిపోయింది.